కలం, దమ్మపేట: తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం కేవలం జనసేన పార్టీతోనే సాధ్యమవుతుందని ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ ఇన్‌ఛార్జి, మాజీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు (Gadala Srinivasa Rao) అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రహీం అధ్యక్షతన నిర్వహించిన అశ్వారావుపేట (Aswaraopeta) నియోజకవర్గ జనసేన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రత్యామ్నాయ శక్తిగా జనసేన..
ఈ సందర్భంగా గడల శ్రీనివాసరావు (Gadala Srinivasa Rao) మాట్లాడుతూ… కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా జనసేన వేగంగా ఎదుగుతోందన్నారు. సామాజిక తెలంగాణ నిర్మాణమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు బీసీ నాయకుడిని ముఖ్యమంత్రిగా చూడాలని ఆకాంక్షిస్తున్నారని వివరించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని విమర్శించారు. 2 లక్షల ఉద్యోగాల హామీని నెరవేర్చకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారని, మధిరలో నిరుద్యోగి ఆత్మహత్యాయత్నమే దానికి నిదర్శనమని పేర్కొన్నారు.
రైతాంగానికి తీవ్ర అన్యాయం..
రైతు బంధు, రైతు బీమా పథకాల అమలు సరిగ్గా లేక రైతాంగం తీవ్ర అన్యాయానికి గురవుతోందని గడల శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, గిరిజనులు, బీసీలు, ఆటో కార్మికులు కాంగ్రెస్ తీరుపై ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ఏపీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న నాలుగు శాఖల సంక్షేమ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణలో కూడా అలాంటి పాలన అందించడమే తమ ధ్యేయమని చెప్పారు. స్థానిక కాంగ్రెస్ నేతలు హైదరాబాద్‌కే పరిమితమయ్యారని, జిల్లా ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని గడల హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Also Read : వాస్తాపూర్ వాటర్‌ఫాల్స్‌ని చూసోద్దాం రండి!
Follow Us On : WhatsApp

