పీఎం శ్రీ బడుల్లో మ్యూజిక్ టీచర్ లేక అవస్థలు..!

కలం, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో : మామూలు ప్రభుత్వ పాఠశాలలకు భిన్నంగా పిఎం శ్రీ ప్రభుత్వ పాఠశాలలను (PM Shri Schools) తీర్చిదిద్ది ఆదర్శ పాఠశాలలుగా మార్చాలని ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయి. నూతన జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం పీఎం శ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకం కింద 2023 -24 సంవత్సరంలో ఈ పథకం ప్రారంభమైన తెలంగాణలో ఈ ఏడాది మార్చి 25 నాటికి మొత్తం 832 పాఠశాలలను పిఎం శ్రీ పథకం కింద ఎంపిక చేశారు.

ఇందులో 29 కేంద్ర ప్రభుత్వ పాఠశాలలతో పాటు 9 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అత్యాధునిక వసతులు కల్పించి ప్రపంచంతో పోటీపడే విధంగా తర్ఫీదునిస్తారు. చిన్న వయసు నుంచే కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర విషయాల గురించి అవగాహన కలిగిస్తారు. కేంద్ర ప్రభుత్వం పిఎం శ్రీ కింద ఎంపికైన పాఠశాలకు ఐదేళ్లలో కోటి నుండి రూ.2.25 కోట్ల నిధులను మంజూరు చేయనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 60 :40 నిష్పత్తిలో ఈ పాఠశాలల కోసం ఖర్చు చేయనున్నారు. కార్పొరేట్ స్థాయి పాఠశాలలుగా తీర్చిదిద్ది అదే స్థాయిలో విద్యను అందించడానికి సంకల్పించారు. ప్రభుత్వ ఉద్దేశాలు మంచివైనా ఆచరణలో మాత్రం ఆశించిన ఫలితాలు రావడం లేదు.

పాఠంతో పాటు పాట ..

పీఎం శ్రీ పాఠశాలల్లో (PM Shri Schools) చదువుతోపాటు ,ఆటపాటల్లో నైపుణ్యం పెంపొందించడానికి విశేషంగా కృషి చేస్తారు. అలాగే సంగీతంలో ప్రావీణ్యం కల్పించేందుకు సంగీత పరికరాలను సమకూర్చుతారు. ఇందులో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 115 పీఎం శ్రీ పాఠశాలలో సంగీతం, వాయిద్యాలు నేర్పించడానికి ఎంపికయ్యాయి. జిల్లాల వారీగా నాగర్‌కర్నూల్ 27, జోగులాంబ గద్వాల 22, వనపర్తి 21 ,నారాయణపేట19, మహబూబ్నగర్ 26 మొత్తం 115 పాఠశాలలు ఎంపికయ్యాయి.

తెలంగాణ వ్యాప్తంగా మొదటి విడతలో ఎంపిక చేసిన 270 ఉన్నత పాఠశాలలకు మ్యూజిక్ పరికరాలను అందజేశారు. ఇందులో తబలా, హార్మోనియం, మృదంగం, వయోలిన్, కీబోర్డ్, గిటార్ వంటి వాయిద్యాలు ఉన్నాయి. ఒక్కో పీఎం శ్రీ పాఠశాలకు కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్లలో రూ.1 కోటి నుండి రూ.2.25 కోట్ల వరకు నిధులను మంజూరు చేస్తుంది. ఇందులో భాగంగానే మ్యూజిక్ కిట్‌లను సమకూర్చారు. ప్రత్యేకంగా మ్యూజిక్ కిట్ టెండర్ విలువ సుమారు రూ.60,000 నుండి రూ.1 లక్ష వరకు ఒక్కో సెట్‌కు ఉంటుంది .

అధికారిక టెండర్ల ద్వారా తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ -( టి జి టి ఎస్) వీటిని పీఎం శ్రీ కింద ఎంపికైన పాఠశాలలకు సరఫరా చేసింది. పీఎం శ్రీ పాఠశాలల పనితీరులో ప్రధానంగా “హోలిస్టిక్ డెవలప్‌మెంట్” సమగ్ర వికాసం పై దృష్టి పెట్టారు. పీఎం శ్రీ కింద ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలకు మ్యూజిక్ పరికరాలు చేరాయి. అయితే మ్యూజిక్ పరికరాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు, నేర్పించేందుకు తర్ఫీదు పొందిన టీచర్లు లేకపోవడంతో మ్యూజిక్ పరికరాలన్నీ పాఠశాలల్లో వృధాగా పడి ఉన్నాయి. విద్యార్థులు వీటిని చూసి ఆసక్తి కనబరుస్తున్న నేర్పించేందుకు టీచర్లు లేకపోవడం విద్యార్థుల పాలిట శాపంగా మారింది.

ఈ ఏడాది జూన్-జూలైలో తెలంగాణ ప్రభుత్వం గురుకులాలు , ఇతర పాఠశాలల్లో మ్యూజిక్ టీచర్ల భర్తీకి సుమారు 202 టీచర్ పోస్టుల ఎంపికకు ర్యలు చేపట్టింది. ప్రస్తుతం నియామక ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు చెబుతున్నప్పటికీ, అవి ఎప్పుడు పూర్తి అవుతాయో తెలవడం లేదు. త్వరలోనే నిపుణులైన ఉపాధ్యాయుల ద్వారా క్లాసులు ప్రారంభం కానున్నాయని అధికారులు ఊరిస్తున్నారు తప్ప ఉపయోగం లేదని విద్యార్థులు వాపోతున్నారు.

Also Read : ఇండోనేషియాలో ఘోర పడవ ప్రమాదం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>