కలం వెబ్ డెస్క్ : న్యూ ఇయర్ వేడుకలు సమీపిస్తున్న సందర్భంగా ఢిల్లీ పోలీసులు(Delhi Police) అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు ఆగ్నేయ జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజామున వరకు నిర్వహించిన ‘ఆపరేషన్ ఆఘాత్ 3.0’(Operation Aghaat 3.0)లో భారీ సంఖ్యలో నేరస్తులను( criminals) పట్టుకున్నారు. అక్రమ మద్యం(Illegal Liquor)
రవాణా, మాదక ద్రవ్యాల(Drug) అమ్మకాలు, జూదం వంటి నేరాలపై దృష్టి సారించి ఎక్సైజ్ యాక్ట్, ఎన్డీపీఎస్ యాక్ట్, గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద 285 మంది నిందితులను అరెస్టు చేశారు. దీంతో పాటు మరో 504 మందిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో బ్యాడ్ క్యారెక్టర్‌గా రికార్డు ఉన్న 116 మందిని, ఆస్తి నేరాలకు పాల్పడిన 10 మంది దొంగలను, ఐదుగురు ఆటోలిఫ్టర్లను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఆపరేషన్‌లో 21 దేశీయ తుపాకులు, 20 బుల్లెట్లు, 27 కత్తులు జప్తు చేశారు. 12,258 క్వార్టర్ల అక్రమ మద్యం, 6.01 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. జూదం నిర్వాహకుల నుంచి రూ.2,30,990 నగదు జప్తు చేయగా, 310 మొబైల్ ఫోన్లు, 231 బైకులు, ఒక కారును రికవరీ చేశారు. మొత్తంగా నివారణ చర్యల్లో 1,306 మందిని రౌండప్ చేసినట్లు డీసీపీ హేమంత్ తివారీ తెలిపారు. నగరంలో నిరంతరాయంగా ఇలాంటి చర్యలు కొనసాగుతాయని, పౌరుల భద్రత పెంపొందించేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు.


