కలం, వనపర్తి: ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (MLA Megha Reddy ) హెచ్చరించారు. శనివారం రేవల్లి, ఏదుల మండల సర్వసభ్య సమావేశాల్లో పాల్గొన్న ఆయన అన్ని ప్రభుత్వ శాఖల పనితీరును శాఖలవారీగా సమీక్షించారు. సమావేశంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఈ, ఎంఈఓలపై మెమోలు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సర్పంచులే ప్రత్యక్షంగా సభ దృష్టికి తీసుకొస్తున్నారని, వాటి పరిష్కారంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యూరియా పంపిణీలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, ఆన్లైన్ సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. ఎల్నీనో పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు ఇంకుడు గుంతలు, ఫార్మ్పాండ్లు నిర్మించుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
‘ఆస్తులు కాదు… విద్యే శాశ్వత సంపద’
పిల్లలకు ఆస్తులు కూడబెట్టడం కంటే ఉన్నత విద్య అందించడం ముఖ్యమని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తోందని, ప్రైవేట్ పాఠశాలలపై లక్షలు ఖర్చు చేయకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయని, వైద్య సేవల్లో నిర్లక్ష్యం చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వనపర్తి నియోజకవర్గంలో గత 30 నెలల్లో విద్యుత్ శాఖ ద్వారా రూ.140 కోట్ల పనులు పూర్తయ్యాయని, మరో రూ.40 కోట్ల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని, మట్టి, ఇసుక రవాణాపై ఆంక్షలు విధించవద్దని అధికారులను ఆదేశించారు.
మిషన్ భగీరథపై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే..
వేల కోట్లు ఖర్చు చేసినా గ్రామాల్లో తాగునీటి సమస్యలు కొనసాగుతున్నాయని, అది ప్రజలకు కాకుండా “కమిషన్ భగీరథ”గా మిగిలిపోయిందని విమర్శించారు. ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూభారతితో రైతుల భూ సమస్యలను వేగంగా పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రతి 45 రోజులకు సర్వసభ్య సమావేశాలు నిర్వహిస్తామని, సమావేశాలకు గైర్హాజరయ్యే లేదా నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సమావేశాల్లో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

