‘జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్’ మిషన్.. బాలల అక్రమ రవాణాపై బిగ్ ఫైట్

కలం, వనపర్తి: ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల్లో బాలల అక్రమ రవాణా (Child Trafficking) ను అరికట్టేందుకు రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్ణాయక జాతీయ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా ‘జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ (JRC)’ నెట్‌వర్క్ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఈ మూడు జిల్లాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సంస్థ ప్రకటించింది.

బాలల అక్రమ రవాణా ప్రమాదం ఉన్న కుటుంబాలను గుర్తించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో అనుసంధానం చేయడంతో పాటు పిల్లలు చదువు మానకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. అక్రమ రవాణాకు పాల్పడే ముఠాలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సంబంధిత శాఖలతో సమన్వయంగా పనిచేస్తామని పేర్కొంది.

దేశవ్యాప్త ఉద్యమం..

న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో నిర్వహించిన “బాలల హక్కులు, సామర్థ్యం, సమృద్ధిని నిర్ధారించడం” అంశంపై జరిగిన జాతీయ సదస్సులో ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. 2030 నాటికి భారత్‌ను బాలల అక్రమ రవాణా రహిత దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా 250కి పైగా స్వచ్ఛంద సంస్థలతో కూడిన JRC ఈ ఉద్యమాన్ని నడిపిస్తోంది. ఏప్రిల్-2023 నుంచి డిసెంబర్-2025 వరకు దేశవ్యాప్తంగా 1,22,516 మంది పిల్లలను అక్రమ రవాణా నుంచి రక్షించినట్లు వెల్లడించారు.

కేంద్ర మంత్రి ప్రశంసలు

కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ మాట్లాడుతూ.. పిల్లలను అక్రమ రవాణా, లైంగిక దోపిడీ నుంచి రక్షించడంలో స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. ఒక్క చిన్నారి ప్రాణాన్ని కాపాడినా అది అత్యంత పవిత్రమైన సేవ అని పేర్కొన్నారు. రూరల్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్ చిన్నమ్మ తామస్ మాట్లాడుతూ, బాలల అక్రమ రవాణా దేశంలో అత్యంత తీవ్రమైన సామాజిక సమస్యగా మారిందన్నారు. ఉద్యోగాలు, విద్య పేరుతో పేద కుటుంబాల పిల్లలను మోసగించి లైంగిక దోపిడీ, బాల కార్మిక వ్యవస్థలోకి నెట్టేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగంతో కలిసి ప్రమాదంలో ఉన్న కుటుంబాలకు రక్షణ కల్పించి, రక్షించబడిన పిల్లలకు సమగ్ర పునరావాసం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>