కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పర్ణశాల (Parnasala) ను గోదావరి వరద నీరు ముంచెత్తింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది తీవ్రరూపం దాల్చడంతో వరద ఉధృతి ప్రమాదకరంగా మారింది. వరద నీరు వేగంగా చేరుకోవడంతో పర్ణశాలలోని ప్రసిద్ధ సీతమ్మవారి విగ్రహం, శ్రీరాముని పాదాలు వామన గుంటలు పూర్తిగా నీట మునిగిపోయాయి.
గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పర్ణశాల వైపు వెళ్లే భక్తులు, వాహనాల రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. పరిస్థితిని స్థానిక యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోంది. గోదావరి వరద ప్రవాహం తగ్గేవరకు భక్తులు, పర్యాటకులు నదీ తీర ప్రాంతాలకు రావద్దని సూచించారు.

