అర్బన్ ఇందిరమ్మ ఇండ్లకు బూస్టప్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘అర్బన్ ఇందిరమ్మ ఇండ్ల’ స్కీమ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తున్నది. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) – అర్బన్’ స్కీమ్ కింద ప్రతీ రాష్ట్రానికి కొన్ని ఇండ్లను కేంద్రం కేటాయిస్తున్నది. ఇందులో తెలంగాణకు మొత్తం 3.89 లక్షలు మంజూరు చేసింది. వీటి కోసం రూ. 6,552 కోట్లను కేటాయించగా.. అందులో రూ. 4,168 కోట్లు దశలవారీగా రిలీజ్ చేస్తున్నది. ఈ ఏడాది ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ కింద రూ. 253.73 కోట్లు వచ్చాయి. దీంతో అర్బన్ ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ను బూస్టప్ దక్కినట్లయింది.

ఇప్పటికే ‘క్యూర్’ ఏరియాలో అర్బన్ ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Houses) కోసం రాష్ట్ర ప్రభుత్వం అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఆ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతున్నది. అర్బన్ ఏరియాలోని పేదలకు, మధ్య తరగతి ప్రజలకు సొంత గూడు ఉండాలన్న లక్ష్యంతో స్కీమ్ ను తీసుకొచ్చింది. ప్రస్తుతం నివసిస్తున్న ఏరియాల్లోని లబ్ధిదారులకు అందుబాటులో ఉండేలా వీటిని నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటీవల అధికారులను ఆదేశించారు. కేంద్రం మంజూరు చేసిన 3.89 లక్షల ఇండ్లు ‘క్యూర్’కు మాత్రమే కాకుండా 93 పట్టణాలకు వర్తించనుంది. ఫలితంగా రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లోనూ ఇండ్ల నిర్మాణం ఊపందుకోనుంది.

పట్టణాల్లోని పేదలు, మధ్య తరగతి ప్రజలకు సొంత ఇల్లు ఉండాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి కేంద్రం నుంచి మరో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ వరుసగా చేస్తున్న ప్రతిపాదనలకు, విజ్ఞప్తులకు స్పందించిన మోదీ సర్కార్ రాష్ట్రంలోని అర్బన్ ఏరియాల్లో 3.89 లక్షల ఇండ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ‘క్యూర్’ పరిధితోపాటు ఇతర పట్టణాల్లో ఇందిరమ్మ ఇండ్లు ఊపందుకోనున్నాయి.

ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ రూ. 253.73 కోట్లు

మార్చి, జూన్ నెలల్లో జరిగిన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ (సీఎస్ఎంఎస్) సమావేశంలో తెలంగాణకు మంజూరు చేసిన ఇండ్లు, కేటాయించిన నిధులపై చర్చ జరిగింది. పీఎంఏవై 20 స్కీమ్ కింద రాష్ట్రానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద రూ. 253.73 కోట్లు విడుదలయ్యాయి.

కేంద్రం వాటా.. రాష్ట్ర వాటా..!

రాష్ట్ర ప్రభుత్వ ‘క్యూర్’ రీజియన్‌లో మొత్తం లక్ష ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని టార్గెట్గా పెట్టుకున్నది. ఫస్ట్ ఫేజ్ లో 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 480 చొప్పున 7,680 ఇండ్లను నిర్మించనున్నది. ఇందులో ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున ఖర్చు చేయనున్నది. సుమారు రూ. 384 కోట్లు ఖర్చు కానున్నది. మార్చి, జూన్ నెలల్లో జరిగిన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ (సీఎస్ఎంఎస్) సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం నుంచి రూ. 253.73 కోట్లు రిలీజ్ చేసింది. ఇవి రావడంతో.. ‘క్యూర్’లో ఇండ్లకు రూ. 130 కోట్లను సర్దుబాటు చేసుకోవాల్సి వస్తున్నది.

రాష్ట్రానికి 11 లక్షల ఇండ్లను ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్టు చేశారు. మార్చి, జూన్ నెలల్లో జరిగిన సమావేశాల్లో రాష్ట్రానికి ఇండ్లను మంజూరు చేయడానికి పాజిటివ్‌గా రెస్పాండ్ దక్కడంతో తాజాగా సీఎం చేసిన విజ్ఞప్తికి కూడా అదే తరహా రిలీఫ్ వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఆ ఇండ్లను మంజూరు చేస్తే నిధుల కేటాయింపు కూడా ఉంటుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఒక మేరకు ఉపశమనం లభిస్తుంది. అర్బన్ లో ఒక్కో ఇందిరమ్మ ఇంటికి రూ. 5 లక్షల సబ్సిడీని ఖరారు చేసిన ఫార్ములా ప్రకారం కేంద్రం తన వాటాగా రూ. 1.50 లక్ష ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన రూ. 3.50 లక్షలను భరిస్తుంది.

‘క్యూర్’లో 8,338 ఇండ్ల ప్రతిపాదన

రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ‘క్యూర్ (CURE)’ అర్బన్ ఇందిరమ్మ ఇండ్ల ఫస్ట్ ఫేజ్‌లో 7,680 నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. కేంద్రానికి మాత్రం 8,338 ఇండ్లను ఇవ్వాల్సిందిగా ప్రతిపాదించింది. రాష్ట్రం అడిగినన్ని ఇండ్లను ఇవ్వకపోవచ్చనే అభిప్రాయం గతంలో నుంచి కొనసాగుతున్నది. ఈ ప్రతిపాదనను పరిశీలించి ఆమోదం తెలిపిన సీఎస్ఎంసీ కేవలం ‘క్యూర్’కు పరిమితం చేయకుండా 93 పట్టణాల్లో నిర్మించేలా నిర్ణయం తీసుకున్నది.

ఈ ఇండ్లకు మొత్తం రూ. 541.97 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి కేంద్ర వాటాగా రూ. 125.07 కోట్లకు ఆమోదం తెలిపింది. రాష్ట్రం తన వాటాగా రూ. 303.97 కోట్లను భరించాల్సి ఉంటుంది. ఏడాదిన్నర వ్యవధిలో ఇండ్లను నిర్మించాలని కేంద్ర స్కీమ్ టార్గెట్ ఉన్నా.. రాష్ట్రం మాత్రం సంవత్సర కాలంలోనే పూర్తి చేయాలని రోడ్ మ్యాప్ రూపొందించింది.

రాష్ట్రంలోని అర్బన్ ఇండ్లపై జులై 13న కేంద్ర ప్రభుత్వం తయారుచేసిన నోట్ ప్రకారం..

రాష్ట్రానికి మంజూరైన ఇండ్లు : 3,89,372
గ్రౌండింగ్ అయిన ఇండ్లు : 2,73,453
నిర్మాణం పూర్తయింది : 2,29,673
నివాసం ఉంటున్న ఇండ్లు : 1,00,251
నిర్మాణం పూర్తయినా నివాసం లేనివి : 39,654
నిర్మాణంలో ఉన్నవి : 43,780
శాంక్షన్ అయ్యి గ్రౌండింగ్ కానివి : 1,15,919

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>