కలం డెస్క్ : Telangana Irrigation System | కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనేది అన్ని పార్టీలూ ఒప్పకునే అంశం. అయితే ఏ పార్టీ పాలనలో ఎక్కువ అన్యాయం జరిగిందనేది కన్‌ఫ్యూజన్. సమైక్య రాష్ట్రంలోకంటే బీఆర్ఎస్ పాలనలో ఎక్కువ అన్యాయం, ద్రోహం జరిగిందనేది కాంగ్రెస్ వాదన. కాంగ్రెస్ చేతకానితనంతో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని, పదేండ్ల కేసీఆర్ పాలన భేష్ అనేది బీఆర్ఎస్ వాదన. రెండు పార్టీలూ తెలంగాణకు అన్యాయమే చేశాయన్నది బీజేపీ లాజిక్. ఏ పార్టీ వాదన ఎలా ఉన్నా ఈ నెల 29న ప్రారంభమయ్యే తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో జల వివాదాలు, తెలంగాణకు జరిగిన అన్యాయం, పాలకుల నిర్ణయాలతో జరిగిన ద్రోహం.. ఇలాంటి అంశాలపై వాడివేడి చర్చ జరగనున్నది. సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని గులాబీ నేతలు చెప్తున్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రి అవగాహన :
కృష్ణా, గోదావరి జలాలకు(Irrigation System) సంబంధించిన అంశాలపై అసెంబ్లీలో ప్రధాన చర్చ జరగనున్నందున కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కలిగించనున్నారు. నది పుట్టి తెలంగాణలోకి ప్రవేశించింది మొదలు సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ఱభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు, తెలంగాణ ఏర్పడే నాటికి వాటి ప్రోగ్రెస్, బీఆర్ఎస్ హయాంలో జరిగిన ప్రగతి, ఖర్చు చేసిన నిధులు, రైతులు-ప్రజలకు కలిగిన లబ్ధి.. ఇలాంటి అన్ని అంశాలను లెక్కలతో సహా ఎమ్మెల్యేలకు మంత్రి ఉత్తమ్ వివరించనున్నారు. కృష్ణా జలాల్లో ఏపీ దోపిడీ ఎవరి హయాంలో ఎక్కువగా జరిగిందో లెక్కలతో అర్థం చేయించనున్నారు. ప్రజా భవన్‌లో ఈ నెల 1న ఈ సమావేశానికి ముఖ్యమంత్రి సహా మంత్రులంతా హాజరుకానున్నారు. ఎమ్మెల్యేలందరికీ బుక్‌లెట్‌ను అందజేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ముందే అలర్టయిన కేసీఆర్ :
నదీ జలాలపై అసెంబ్లీలో చర్చ జరగనున్నందున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ అలర్ట్ చేశారు. అసెంబ్లీలోనే చర్చిద్దాం… రావాలి.. అంటూ కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాలు విసరడంతో హాజరు కావాలనే ఆయన నిర్ణయించుకున్నట్లు గులాబీ వర్గాలు తెలిపాయి. నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, నేతలతో కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో శుక్రవారం సాయంత్రం సుదీర్ఘ సమావేశాన్ని నిర్వహించారు. సభకు హాజరవుతానని క్లారిటీ ఇవ్వడంతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వైఖరిపై దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు ఇప్పటికే పాత డాక్యుమెంట్లు, కేంద్ర ప్రభుత్వంతో జరిగిన కరస్పాండెన్స్, ఏపీ ప్రభుత్వ నీటి దోపిడీ.. వీటిని వివరించేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నారు.
Read Also: ‘సర్’తో తగ్గిపోయే ఓట్లెన్ని?.. మార్చి తర్వాత తెలంగాణలో స్టార్ట్
Follow Us On: Youtube


