కలం, జగిత్యాల: జగిత్యాల జిల్లా ధరూర్ క్యాంప్‌లోని పాత ఎస్పీ కార్యాలయ భవనంలో తాత్కాలిక ప్రాంగణంలో నిర్వహిస్తున్న కేంద్రీయ విద్యాలయం (Kendriya Vidyalaya)లో 2026–27 విద్యా సంవత్సరానికి బాలవాటిక–1 (నర్సరీ) నుంచి ఐదవ తరగతి వరకు ప్రవేశాల కోసం ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పిల్లలను కేంద్రీయ విద్యాలయంలో చేర్పించేందుకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 1, 2026 నుంచి ప్రారంభమై ఆగస్టు 14, 2026 వరకు కొనసాగుతుందని తెలిపారు.
ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.40 గంటల వరకు దరఖాస్తులను స్వీకరిస్తారని పేర్కొన్నారు. పూర్తిగా నింపిన దరఖాస్తు పత్రాలను అవసరమైన ధ్రువపత్రాలతో పాటు కేంద్రీయ విద్యాలయం, చల్ గల్ తాత్కాలిక క్యాంపస్, పాత ఎస్పీ కార్యాలయ భవనం, ధరూర్ క్యాంప్, జగిత్యాల చిరునామాలో సమర్పించాలని సూచించారు. బాలవాటిక–1, బాలవాటిక–2, బాలవాటిక–3, ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఆయా తరగతుల్లో ఉన్న ఖాళీలకు మాత్రమే ప్రవేశాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ప్రవేశాలకు కేంద్రీయ విద్యాలయ (Kendriya Vidyalaya) సంస్థ ప్రవేశ మార్గదర్శకాలు–2026–27లో నిర్దేశించిన వయోపరిమితి, అర్హతలు, నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు. దరఖాస్తుతో పాటు విద్యార్థి జనన ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం (వర్తిస్తే), రేషన్ కార్డు/బీపీఎల్/ఆదాయ ధృవీకరణ పత్రం (వర్తిస్తే), రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవా ధృవీకరణ పత్రం, బదిలీ వివరాలు, అలాగే కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశ మార్గదర్శకాల ప్రకారం అవసరమైన ఇతర పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలని తెలిపారు.
ప్రవేశ ప్రక్రియ పూర్తిగా కేంద్రీయ విద్యాలయ సంస్థ ప్రవేశ మార్గదర్శకాలు 2026–27కు అనుగుణంగానే నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం కేంద్రీయ విద్యాలయాన్ని లేదా కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశ మార్గదర్శకాలను సంప్రదించాలని సూచించారు.
Also Read : గుడ్ న్యూస్.. మరింత సులభంగా ఫ్యామిలీ సర్టిఫికేట్
Follow Us On : WhatsApp

