CWG 2026: సాక్షి సెమీస్.. లవ్లీనాకు ఇప్పటికే పతకం ఖాయం

కలం, స్పోర్ట్స్: భారత్ బాక్సింగ్‌కు మరో శుభవార్త. కామన్వెల్త్ గేమ్స్ 2026లో సాక్షి చౌదరి (Sakshi Chaudhary) సెమీఫైనల్‌కు చేరింది. దీంతో ఆమెకు పతకం ఖాయమైంది. ఇదే సమయంలో లవ్లీనా బోర్గొహైన్‌కు కూడా ఇప్పటికే పతకం ఖాయమైంది. మహిళల 51 కేజీల క్వార్టర్ ఫైనల్ లో ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన కైట్లిన్ ఫ్రైయర్స్‌పై సాక్షి 5-0తో ఘన విజయం సాధించింది. మూడు రౌండ్లలోనూ పూర్తి ఆధిపత్యం చాటింది. ప్రతి రౌండ్‌ను 5-0తోనే తన ఖాతాలో వేసుకుంది. చురుకైన కదలికలు, కచ్చితమైన పంచ్‌లతో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.

టోర్నీకి ముందు సాక్షి (Sakshi Chaudhary) మళ్లీ 51 కేజీల విభాగంలోకి మారింది. భారత ట్రయల్స్‌లో మంచి ప్రదర్శనతో ఈ పోటీలకు వచ్చింది. అదే ఫామ్‌ను ఇక్కడ కూడా కొనసాగించింది. అంతకుముందు బోట్స్వానాకు చెందిన లెథాబో మోడుకానెలేపై గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు శుక్రవారం జరిగే సెమీఫైనల్లో కెనడాకు చెందిన అంబర్-జేన్ వాల్‌తో సాక్షి తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే స్వర్ణ పతక పోరుకు చేరుతుంది.

భారత్ తరఫున మరో స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గొహైన్ కూడా ఇప్పటికే సెమీస్‌లో ఉంది. మహిళల 75 కేజీల విభాగంలో ఆమెకు క్వార్టర్ ఫైనల్ లో బై లభించడంతో నేరుగా సెమీఫైనల్‌కు చేరుకుంది. దీంతో ఆమెకు కనీసం కాంస్య పతకం ఖాయమైంది. ఇక మరో భారత బాక్సర్లపై కూడా అందరి దృష్టి ఉంది. మహిళల 70 కేజీల్లో అరుంధతి చౌదరి, పురుషుల 60 కేజీల్లో సచిన్ సివాచ్, 80 కేజీల్లో అంకుష్ యాదవ్, 90+ కేజీల్లో నరేందర్ బెర్వాల్ తమ క్వార్టర్ ఫైనల్ బౌట్లకు సిద్ధమయ్యారు.

సచిన్ ఇప్పటికే తొలి రెండు రౌండ్లు దాటి క్వార్టర్ ఫైనల్‌కు చేరగా, అంకుష్ కూడా చివరి-8లోకి అడుగుపెట్టాడు. ఇప్పటివరకు కామన్వెల్త్ గేమ్స్ 2026 (CWG 2026)లో భారత్ 12 పతకాలు సాధించింది. ఇప్పుడు బాక్సింగ్‌లో సాక్షి, లవ్లీనా రూపంలో మరో రెండు పతకాలు ఖాయమవడంతో భారత ఆశలు మరింత బలపడ్డాయి.

Read Also: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ 230 స్థానాల జంప్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>