ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ 230 స్థానాల జంప్

కలం, స్పోర్ట్స్ : భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అంతర్జాతీయ క్రికెట్‌లో తన జోరును కొనసాగిస్తున్నాడు. జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో మెరిసిన ఈ 15 ఏళ్ల ఆటగాడు తాజా ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 230 స్థానాలు ఎగబాకాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో వైభవ్ 151 పరుగులు చేశాడు. 50.33 సగటుతో ఆకట్టుకున్నాడు. రెండు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. ఈ ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు.

తాజా ర్యాంకింగ్స్‌లో వైభవ్ (Vaibhav Sooryavanshi) 536 రేటింగ్ పాయింట్లతో 48వ స్థానానికి చేరుకున్నాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఇది అతని కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంక్. మరోవైపు భారత వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ప్రపంచ నంబర్-1 టీ20 బ్యాటర్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అతని ఖాతాలో 910 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. పాకిస్థాన్‌కు చెందిన సాహిబ్జాదా ఫర్హాన్ 848 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. జింబాబ్వేతో రెండో టీ20లో ఇషాన్ 81 పరుగులు చేసిన తర్వాత అతని రేటింగ్ 916కు చేరింది.

టీ20 చరిత్రలో ఇది మూడో అత్యధిక బ్యాటింగ్ రేటింగ్. అభిషేక్ శర్మ 931, ఇంగ్లండ్ బ్యాటర్ డేవిడ్ మలాన్ 919 రేటింగ్‌ల తర్వాత ఇషాన్ నిలిచాడు. చివరి మ్యాచ్ తర్వాత రేటింగ్ 910కు తగ్గినా, అతని కెరీర్ బెస్ట్ 916 రేటింగ్ మాత్రం భారత దిగ్గజాలు సూర్యకుమార్ యాదవ్‌ (912), విరాట్ కోహ్లీ (909) కెరీర్ గరిష్ఠ రేటింగ్‌ల కంటే ఎక్కువగానే ఉంది. భారత్‌కు చెందిన మరో బ్యాటర్ తిలక్ వర్మ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ఆరో స్థానానికి చేరాడు.

కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఏడు స్థానాలు ఎగబాకి 24వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. బౌలర్ల జాబితాలో రవి బిష్ణోయ్ 31 స్థానాలు ఎగబాకి 41వ ర్యాంక్‌కు చేరాడు. సిరీస్‌లో మూడు వికెట్లు తీయడం అతనికి కలిసి వచ్చింది. గాయం కారణంగా ఈ పర్యటనకు దూరమైన వరుణ్ చక్రవర్తి మూడు స్థానాలు కోల్పోయినా టాప్-10లోనే కొనసాగుతున్నాడు. జింబాబ్వే ఆటగాళ్లూ ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించారు. ర్యాన్ బర్ల్ ఆరు స్థానాలు ఎగబాకి సంయుక్తంగా 85వ స్థానానికి చేరాడు. ఫాస్ట్ బౌలర్ బ్లెసింగ్ ముజరబానీ 10 స్థానాలు మెరుగుపరుచుకుని 26వ ర్యాంక్‌ను అందుకున్నాడు.

Read Also: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>