కలం, వనపర్తి: దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను అందించాలనే లక్ష్యంతో ‘జనతా వికాస్ పార్టీ’ (Janata Vikas Party) ని ఏర్పాటు చేసినట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్యాల మురళీధర్ గుప్తా తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జూలై 20వ తేదీన హయత్‌నగర్ 14వ వార్డులోని పార్టీ కార్యాలయంలో జరిగిన వ్యవస్థాపక సభ్యుల జనరల్ బాడీ సమావేశంలో పార్టీ జాతీయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వెల్లడించారు.
సమావేశంలో మల్యాల మురళీధర్ గుప్తాను జాతీయ అధ్యక్షుడిగా, పొలుమూరి హర్షవర్ధన్‌ను నేషనల్ జనరల్ సెక్రటరీగా, ఎం. అభినయ్‌ను నేషనల్ ట్రెజరర్‌గా ఎన్నుకున్నట్లు తెలిపారు. దేశ అభివృద్ధికి కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమనే ఉద్దేశంతో మేధావులు, విద్యావంతులు, రైతులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాసంఘాల నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు కలిసి ఈ జాతీయ రాజకీయ పార్టీని స్థాపించినట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన విద్య, వైద్యం అందించడం, వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ ఖాళీల భర్తీ, పారిశ్రామిక అభివృద్ధి, దేశ సమగ్రాభివృద్ధి కోసం కృషి చేయడం పార్టీ (Janata Vikas Party) ప్రధాన లక్ష్యాలని వెల్లడించారు. పార్టీ జాతీయ, రాష్ట్ర, ఇతర అనుబంధ కమిటీలను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు ఆసిరెడ్డి, ఇస్రంపల్లి సుదర్శన్, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Also: తెలంగాణ సాగునీటి రంగానికి ఊరట.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
Follow Us On : WhatsApp

