కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊహించని రీతిలో భారీ ఊరట లభించింది. రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులైన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్ బ్యారేజ్, గౌరవెల్లి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులకు సుప్రీంకోర్టు ధర్మాసనం (Supreme Court ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
ఈ తీర్పు ప్రకారం.. కేంద్ర పర్యావరణ శాఖ 2021లో జారీ చేసిన ఆఫీస్ మెమొరాండమ్ (OM) ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ తీర్పు భవిష్యత్‌కు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. గతంలో అదే ఆఫీస్ మెమొరాండమ్ కింద మంజూరైన పర్యావరణ అనుమతులన్నీ పూర్తిగా చెల్లుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణాలకు పూర్తి చట్టబద్ధమైన రక్షణ లభించినట్లయింది. ఇప్పటికే శరవేగంగా జరుగుతున్న ఈ కీలక ప్రాజెక్టుల నిర్మాణ పనులకు ఇకపై ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు ఉండవని సుప్రీంకోర్టు తెలిపింది. అలాగే కార్యనిర్వాహక ఉత్తర్వులతో చట్టాలను భర్తీ చేయడం కుదరదని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఇకపై ముందస్తు పర్యావరణ అనుమతులు లేని ఏ కొత్త ప్రాజెక్టుకూ అనుమతి ఉండదని స్పష్టం చేసింది.

