పేదల సొంతింటి కల నెరవేరుస్తాం: మంత్రి పొంగులేటి

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లాలో అభివృద్ధి పనుల జోరు కొనసాగుతోందని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలంలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.

డాక్యా తండా గ్రామంలో రూ.1.41 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మంగళగూడెం–డాక్యా తండా బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, అలాగే పల్లెగూడెం గ్రామంలో రూ.5.80 కోట్లతో గొల్లగూడెం నుంచి ఎన్‌ఎస్‌పీ మీదుగా పల్లెగూడెం వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు మంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తూ ముందుకు సాగుతోందని అన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకు మొదటి విడతలో 4.5 లక్షలు, రెండో విడతలో 2.5 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, మొత్తం 7 లక్షల ఇళ్లకు అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించారు. రెండో విడతలో మిగిలిన గ్రామాలకు త్వరలోనే ఇళ్లను కేటాయిస్తామని, రాబోయే మూడో, నాలుగో విడతలలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని హామీ ఇచ్చారు. రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి రూ.6 వేల చొప్పున కేవలం 9 రోజులలో రూ.9,200 కోట్లను రైతుల ఖాతాలలో నేరుగా జమ చేశామని చెప్పారు. 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేసి రూ.21 వేల కోట్లను విడుదల చేశామని వివరించారు.

సాధారణ మద్దతు ధరతో పాటు సన్న వరిధాన్యానికి అదనంగా రూ.500 బోనస్ అందిస్తున్నామని తెలిపారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందని, రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కార్యాచరణ అమలు చేస్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, కొత్త రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ ప్రారంభించామని గుర్తు చేశారు.

గ్రామీణ రహదారులు, తాగునీరు, విద్యాసంస్థలు, మౌలిక వసతుల అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపాలిటీ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, పీఆర్ ఈఈ మహేష్ బాబు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read Also: తెలంగాణ సాగునీటి రంగానికి ఊరట.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>