కలం, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది ఇష్టపడే ఏకైక ఉత్తేజ పానీయం కాఫీ. చాలామందికి ఇది కేవలం పానీయం మాత్రమే కాదు, రోజూవారీ దినచర్యలో భాగం. ఉదయం లేవగానే కనీసం ఒక్క కప్పు కాఫీ అయినా తాగకపోతే రోజంతా ఏదో వెలితిగా అనిపించే వారు చాలా మంది ఉంటారు. మానసిక ప్రశాంతతను, తక్షణ ఉత్సాహాన్ని ఇచ్చే ఈ కాఫీలలో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి. అవే ఫిల్టర్ కాఫీ, ఇన్ స్టంట్ కాఫీ (Filter Coffee vs Instant Coffee). అయితే, ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిల్టర్ కాఫీ
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫిల్టర్ కాఫీలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను రక్షించడంలో సహాయపడతాయి. అలాగే వాపు (Inflammation) తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా కాఫీ గింజల్లో కాఫెస్టాల్ అనే సహజ నూనె ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతుందట. కానీ ఫిల్టర్ కాఫీ తయారుచేసేటప్పుడు ఉపయోగించే ఫిల్టర్ పేపర్ ఈ నూనెలను ఎక్కువగా అడ్డుకుంటుందని చెబుతున్నారు. దీంతో శరీరానికి ఉపయోగకరమైన పదార్థాలు ఎక్కువగా అందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
ఇన్స్టంట్ కాఫీ
ఇన్స్టంట్ కాఫీ తయారుచేసుకోవడం చాలా సులభం. ఫిల్టర్ కాఫీతో పోలిస్తే తయారుచేసుకోవడానికి సమయం కలిసి రావడంతో చాలామంది రోజులో దీనిని ఎక్కువసార్లు తాగేందుకు మొగ్గు చూపుతారు. అయితే, ఇలా పదే పదే తాగడం వల్ల శరీరంలోకి కెఫిన్ అధిక మోతాదులో చేరే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అంతేకాకుండా ఇన్ స్టంట్ కాఫీని తయారు చేసే ప్రాసెసింగ్ సమయంలో, కాఫీ గింజల్లో సహజసిద్ధంగా ఉండే కొన్ని రకాల ఆరోగ్యకరమైన యాంటీఆక్సిడెంట్లు, ఇతర ప్రయోజకరమైన పదార్థాలు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. అయినప్పటికీ దీనిని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని, మితంగా తీసుకుంటే ఇన్ స్టంట్ కాఫీని కూడా ఆస్వాదించవచ్చని చెబుతున్నారు. అయినప్పటికీ, దీనిని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు.

