కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా మల్లారం మండల ప్రభుత్వ పాఠశాలలో కేజీఎఫ్ ట్రస్ట్ (KGF Trust) ఆధ్వర్యంలో ఉచితంగా రైటింగ్ బోర్డుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖాధికారి సేవా, ప్రధానోపాధ్యాయులు అన్నం గోపాల్, ఉపాధ్యాయులు వెంకట్, రంగా కిషన్ పాల్గొన్నారు. KGF ట్రస్ట్ ఫౌండర్ జె.సి. మనోజ్ కుమార్, జనరల్ సెక్రటరీ నాగేందర్ ట్రస్ట్ సభ్యులు రైటింగ్ బోర్డులను అందజేశారు.
ఈ సందర్భంగా కేజీఎఫ్ ట్రస్ట్ ఫౌండర్ జె.సి. మనోజ్ కుమార్ మాట్లాడుతూ.. రైటింగ్ బోర్డులు పిల్లల విద్యాభ్యాసానికి ఎంతో ఉపయోగపడతాయనీ ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై, పట్టుదలతో చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ఎంతో మంది నేడు ఉన్నతాధికారులు, వైద్యులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులుగా దేశానికి సేవలందిస్తున్నారని గుర్తు చేశారు. వారిని ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణ, కృషి, మంచి నడవడికతో సమాజానికి ఆదర్శప్రాయమైన వ్యక్తులుగా ఎదగాలనీ సూచించారు.
కేజీఎఫ్ ట్రస్ట్ లక్ష్యం ప్రతి చిన్నారికి విద్య, ఆరోగ్యం, క్రీడలు అనే మూడు ప్రధాన రంగాల్లో అండగా నిలవడమని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రి, ఆరోగ్య సేవలు, క్రీడా అవకాశాలను అందిస్తూ వారి భవిష్యత్తు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన మల్లారం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది గ్రామ ప్రజలకు జేసీ మనోజ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

