కలం, ఖమ్మం బ్యూరో: పాలన అనేది కేవలం ఒక హోదా కాదని, అధికారం అంటే ప్రజలపై పెత్తనం చలాయించడం కానేకాదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న రాష్ట్ర వనరులను ఒకచోట చేర్చి, సమాజ హితం కోసం ప్రణాళికలు రచిస్తూ, ప్రజల అభివృద్ధికి పునాదులు వేయడమే నిజమైన పాలన అని వ్యాఖ్యానించారు. ఖమ్మం (Khammam) జిల్లా మధిర నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషకాహార అల్పాహారాన్ని అందించే సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో పుట్టిన ఏ బిడ్డ కూడా అర్ధాకలితో పాఠశాలకు వెళ్లకూడదన్నదే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన ఆశయమని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అని, సమర్థవంతమైన మానవ వనరులను సానబెట్టిన వజ్రాల్లా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని నొక్కి చెప్పారు. హరే కృష్ణ మిషన్ భాగస్వామ్యంతో అత్యంత శుభ్రమైన వాతావరణంలో మెకనైజ్డ్ కిచెన్లను ఏర్పాటు చేశామని, రాబోయే 3 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా శాశ్వత కిచెన్ నిర్మాణాలను పూర్తి చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, 7 లక్షల మంది రెసిడెన్షియల్ స్కూళ్ల పిల్లలు కలిపి మొత్తం 27 లక్షల మందికి ఒకే సమయానికి వేడివేడి అల్పాహారం అందించడం దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన అంశమన్నారు. టిఫిన్‌తో పాటు వారానికి 3 రోజులు పాలు, మరో 3 రోజులు రాగి జావను కూడా ప్రత్యేకంగా అందిస్తున్నట్లు చెప్పారు.
సంక్షేమ పథకాలు ప్రభుత్వానికి భారం కాదని, ప్రజల అభివృద్ధి కోసం చేసే పెట్టుబడులని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తాను నిర్వహించిన ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలను కళ్లారా చూశానని, ఆ అనుభవాల నుంచే నేడు ప్రజాహిత పథకాలు రూపుదిద్దుకున్నాయని గుర్తుచేసుకున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ఏడాదే రూ.22,500 కోట్ల నిధులతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు రూ.67 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామని తెలిపారు. అలాగే పేద కుటుంబాల ఆరోగ్య బీమా పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని, 1.06 కోట్ల కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, రైతుల కోసం కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.9వేల కోట్ల రైతు భరోసా నిధులను నేరుగా ఖాతాల్లో జమ చేశామని వివరించారు. ప్రజా జీవితాల్లో మార్పు తేవడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

