కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు చేపడతామని పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతారెడ్డి (Warangal CP Swetha Reddy) స్పష్టం చేశారు. నగరంలో 700 మందికి పైగా రౌడీషీటర్లు ఉన్నారని, వారందరిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రౌడీల ఆటకట్టించేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి నేరాలను పూర్తిస్థాయిలో అరికడతామని పేర్కొన్నారు.
శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని హెచ్చరించారు. నేరాల నియంత్రణ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించుతున్నామని, ప్రజలు కూడా నేరస్తులపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు.
గంజాయి ముఠాల కదలికలను అడ్డుకునేందుకు నగరంలో రాత్రి వేళ నైట్ పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేస్తామని తెలిపారు. అదే సమయంలో పోలీసు శాఖలోనూ ప్రక్షాళన చర్యలు కొనసాగిస్తామని సీపీ స్పష్టం చేశారు.
ఈ నెల 19న జరిగిన కాంగ్రెస్ నాయకుడు అడప మహేష్ హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారని వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన రౌడీషీటర్ పత్తి కుమార్తో పాటు మరో నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక దర్యాప్తు బృందం సమర్థవంతంగా విచారణ చేపట్టిందని, నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించిందని సీపీ శ్వేతారెడ్డి (Warangal CP) వివరించారు. నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని, వరంగల్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ వ్యక్తినీ ఉపేక్షించబోమని సీపీ హెచ్చరించారు.
Read Also: రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి: ఎంపీ రఘునందన్ రావు
Follow Us On : WhatsApp

