కలం, వెబ్ డెస్క్: దేశ యువత శక్తి ముందు ప్రధాని మోదీ ఓడిపోయారని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. వీధుల నుంచి పార్లమెంట్ వరకు యువత చేసిన పోరాటాలకు మోదీ తలవంచక తప్పలేదన్నారు. రైతులు, యువత తిరగబడితే.. ఏ ప్రభుత్వమైనా ఓడిపోక తప్పదన్నారు. నీట్ లీకేజీ వంటివి మరోసారి జరగకుండా.. కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
పార్టీలను విడదీసి..
ప్రతిపక్షాలు ప్రజా సమస్యలను లేవనెత్తితే చాలు.. వారిపై కేసులు పెట్టి వేధించడమే పనిగా పెట్టుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మండిపడ్డారు. అందుకోసం ఈడీ, ఐటీ, సీబీఐ వంటి సంస్థలను కూడా వాడుకుంటున్నారని విమర్శించారు. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, మహారాష్ట్రల్లో పార్టీలను ఎలా విడదీసి.. బలహీనపర్చారో దేశమంతా చూసిందన్నారు.
పరీక్షల వ్యవస్థలో మార్పు రావాల్సిందే..
విద్యా, పరీక్షల వ్యవస్థలో కచ్చితంగా మార్పులు రావాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. పార్లమెంటులో దీనిపై సమగ్ర చర్చ జరగాలన్నారు. ఎవరైనా తప్పు చేస్తే.. విధించే శిక్షలు కూడా అత్యంత కఠినంగా ఉండాలన్నారు. లక్షల మంది జీవితాలతో ముడి పడి ఉన్న ఇలాంటి అంశాల్లో ఎవరినీ ఉపేక్షించవద్దన్నారు.
పోటీ చేసే వయస్సు తగ్గించాలి..
దేశంలో ఓటు హక్కు వయస్సు 18గా ఉన్నప్పుడు.. చట్టసభలకు పోటీ చేసే వయస్సు 21 ఏళ్లకు ఎందుకు ఉండొద్దని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుతం 25 సంవత్సరాలు వస్తే గానీ పోటీ చేసే అర్హత లేదన్నారు. 21 ఏళ్లకే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అవుతున్నప్పుడు.. అసెంబ్లీ, పార్లమెంటుకి ఎందుకు ఎన్నిక కాలేరని తెలిపారు. ఆగస్టులో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని స్పష్టం చేశారు.
Read Also: సరిహద్దు గ్రామాలే దేశ మొదటి గ్రామాలు: మోదీ
Follow Us On : WhatsApp

