కలం, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండ వద్ద ఆదివారం లారీ కంటైనర్, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు గాయపడగా, వారిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై నిలిపి ఉంచిన ఒక కారును తప్పించే క్రమంలో లారీ డ్రైవర్ వాహనాన్ని పక్కకు తిప్పడంతో, ఎదురుగా వస్తున్న సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుకభాగాన్ని కంటైనర్ బలంగా ఢీకొట్టింది. ఈ పరిణామంతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నలుగురు ప్రయాణికులను వెంటనే దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. గాయపడిన వారిలో ఒక యువకుడి కుడి భుజానికి తీవ్ర గాయం కావడంతో, మెరుగైన వైద్యం కోసం అతడిని సత్తుపల్లికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.

