కలం, వెబ్ డెస్క్: కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan).. తన రాజీనామా లేఖలో కీలక విషయాలు ప్రస్తావించారు. భారత ప్రజాస్వామ్య శక్తిపై తనకు ఎప్పుడూ అచంచల విశ్వాసం ఉందని.. దేశ యువత ఆశయాలు, కలలు, ఆకాంక్షల పట్ల తనకు అపార గౌరవం ఉందని తెలిపారు. యువత కేవలం దేశ భవిష్యత్తు మాత్రమే కాదని.. వికసిత భారత నిర్మాణానికి వారే ప్రధాన శిల్పులు అని పేర్కొన్నారు. గత 10 రోజులుగా జరిగిన పరిణామాలను చూసి తన మనసు తీవ్రంగా కలత చెందిందని.. ఇది తన వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కాదని స్పష్టం చేశారు. భారత యువశక్తే దేశానికి అసలైన బలం అని.. తాను వ్యక్తిగత ప్రతిష్టకు పోవడం లేదని పేర్కొన్నారు.
దేశ యువతను అపోహలు, దుష్ప్రచారాల వలలో పడనివ్వకూడదన్నదే తన సంకల్పమని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పుకొచ్చారు. జంతర్-మంతర్‌తో పాటు దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులు తమ ప్రయోజనాలకు వినియోగించుకోకుండా చూడాలిని.. దేశ ఐక్యత దెబ్బతినకూడదని తెలిపారు. దేశంలోని ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు తమ సమయాన్ని చదువుకే కేటాయించి, కెరీర్ నిర్మాణంపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తన రాజీనామా పత్రాన్ని ప్రధానమంత్రి మోదీకి పంపించానని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శనం, తనపై ఉంచిన విశ్వాసం, నిరంతర సహకారానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. తన సహచర మంత్రులు, మంత్రిత్వ శాఖ అధికారులు, సిబ్బంది, తనతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. దేశసేవ తన జీవితంలో అత్యున్నత ప్రాధాన్యమని.. దానికి తాను ఎప్పటికీ అంకితభావంతో ఉంటానని చెప్పారు. శ్రీ జగన్నాథ స్వామి ఆశీస్సులతో భారతమాతకు, ఒడిశా ప్రజలకు, దేశ యువత ఆకాంక్షల సాధనకు భవిష్యత్తులోనూ తన వంతు సేవలను అందిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు. కాగా, కాసేపటి క్రితమే ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan).. కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ప్రధాని మోదీకి పంపించారు.
Read Also: కేంద్ర విద్యా శాఖ మంత్రిగా ఫడ్నవీస్.. సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
Follow Us On: Sharechat

