వరి, పత్తికి బదులు ఇవి వేయండి.. రైతులకు కలెక్టర్ కీలక సూచనలు

కలం, హనుమకొండ: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు అధిక నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ (Hanumkonda Collector) చాహత్ బాజ్ పాయి (Chahat Bajpai) సూచించారు. తక్కువ నీటితో అధిక ఆదాయం పొందే పెసర, మినుములు, కందులు, వేరుశెనగ, పొద్దుతిరుగుడు, పచ్చజొన్న వంటి పంటలు ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు లాభదాయకమని పేర్కొన్నారు.

శనివారం ఐనవోలు మండలం సింగారం, పున్నేలు గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ పెసర, ఆయిల్‌పామ్ తోటలు, మామిడి తోటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులతో మాట్లాడారు. సింగారం గ్రామానికి చెందిన రైతు ఆకారపు పురుషోత్తం రెడ్డి మూడు ఎకరాల్లో తక్కువ నీటి వినియోగంతో పెసర పంట సాగు చేస్తున్న తీరును అభినందించారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపికలో మార్పులు చేసుకోవడం ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.

రైతులతో జరిగిన చర్చలో పెసర, మినుములు, కందులు వంటి పంటలకు తక్కువ నీరు అవసరమవుతుందని, కేవలం 60 నుంచి 70 రోజుల్లోనే దిగుబడి రావడంతో పాటు మార్కెట్లో మంచి ధర లభిస్తోందని రైతులు వివరించారు. దీంతో ఈ పంటల సాగుపై ఆసక్తి పెరుగుతోందని తెలిపారు. అనంతరం పున్నేలు గ్రామంలో రైతు వేల్పుల రమేష్ సాగు చేస్తున్న ఆరున్నర ఎకరాల ఆయిల్‌పామ్ తోటను కలెక్టర్ పరిశీలించారు.

పంట సాగు విధానం, నిర్వహణ, దిగుబడి, ఆదాయం తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదే గ్రామానికి చెందిన రైతు రాజారపు బాలరాజు కూడా ఆయిల్‌పామ్ మొక్కలు నాటినట్లు కలెక్టర్‌కు తెలిపారు. అలాగే రైతు రవికిరణ్ రెడ్డి సాగు చేస్తున్న మూడు ఎకరాల మామిడి తోటను సందర్శించిన కలెక్టర్ తోట నిర్వహణ, దిగుబడి, మార్కెటింగ్ అవకాశాలపై రైతుతో చర్చించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి, పత్తి, మొక్కజొన్న వంటి అధిక నీరు అవసరమయ్యే పంటల కంటే ఆరుతడి పంటలే రైతులకు భరోసానిస్తాయని చెప్పారు. ఆయిల్‌పామ్ కూడా దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయాన్ని అందించే లాభదాయక పంట అని పేర్కొంటూ, అనుకూల ప్రాంతాల్లో రైతులు ఈ సాగును విస్తరించాలని సూచించారు.

ప్రత్యామ్నాయ పంటల సాగు ద్వారా ఇప్పటికే ఆదర్శంగా నిలుస్తున్న రైతులను అభినందించిన కలెక్టర్, ఇతర రైతులు కూడా అదే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం పెసర, మినుములు, కందుల విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ పర్యటనలో వ్యవసాయ శాఖ ఏడీ ఆదిరెడ్డి, ఉద్యాన శాఖ జిల్లా అధికారి కమలాకర్ రెడ్డి, తహశీల్దార్ విక్రమ్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>