కలం, సినిమా : భారతీయ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ'(Ramayana). నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీత పాత్రలో నటిస్తుండగా, యష్ రావణుడి పాత్రను పోషిస్తున్నారు. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలా ఉంటే.. నేడు ఎంతో గ్రాండ్గా విడుదల కావాల్సిన ‘రామాయణ’ సినిమా ట్రైలర్ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా (Namit Malhotra) ప్రకటించారు. ‘సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్’ (Sony Pictures Entertainment) తో కుదిరిన భాగస్వామ్యం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో, ‘రామాయణ’ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లాలనే తన కల సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్తో భాగస్వామ్యం ద్వారా నిజమైందని నమిత్ మల్హోత్రా తెలిపారు. ఈ కారణంగా ట్రైలర్ను మరింత విస్తృత స్థాయిలో, ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక తేదీన విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
భారతీయ సినీ చరిత్రలో 100 ఏళ్లకు పైగా ఉన్న వారసత్వంలో, ‘రామాయణ’ను ఒక ప్రముఖ హాలీవుడ్ గ్లోబల్ చిత్రంలా ప్రపంచ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం గర్వకారణమని ఆయన అన్నారు. ఈ చిత్రం ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయ కథల గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రయాణానికి మద్దతు తెలిపిన అభిమానులు, ‘రామాయణ’ను విశ్వసించిన ప్రతి ఒక్కరికీ నమిత్ మల్హోత్రా కృతజ్ఞతలు తెలిపారు. ట్రైలర్ కొత్త విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు.

