కలం యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో జరుగుతున్న వరుణ యాగహోమంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha), ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పాల్గొన్నారు. ఆలయ వేద పండితులు నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అంతకుముందు మంత్రికి పూజారులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఆశీర్వచనం మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు వేదాశీర్వచనం అందజేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు.
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా..
విప్ బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. వరుణ యాగం అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమమని, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలన్నారు. యాదగిరిగుట్టను దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చెందేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. వర్షాలు పడి రైతులకు మంచి పంటలు పండాలని, స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

