కలం, దేవరకొండ: టీపీసీసీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి మద్దతుగా దేవరకొండ (Devarakonda) బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేతలతో పాటు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ (MLA Balu Naik) మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల ఢిల్లీలో జరిగిన నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.
ఇది దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక దురదృష్టకర సంఘటన అని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ గారిపై జరిగిన దాడి ఒక్క వ్యక్తిపై జరిగింది కాదని.. ఇది దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. దేశ స్వాతంత్య్రం, అభివృద్ధిలో నెహ్రూ-గాంధీ కుటుంబం చేసిన త్యాగాలను ఎమ్మెల్యే గుర్తుచేశారు. ఆధునిక భారత నిర్మాణానికి బలమైన పునాది వేశారని, దేశ సమగ్రత కోసం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు.
దేశంలో సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టారని, క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి బలోపేతం చేశారన్నారు. అదే వారసత్వంతో రైతులు, యువత, మహిళలు, నిరుద్యోగులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నారు. రాహుల్ గాంధీకి దేశవ్యాప్తంగా పెరుగుతున్న ప్రజాదరణ చూసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భయపడుతోందని, అందుకే ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు దాడులు, కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
సత్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఎవరూ అణచివేయలేరని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీని, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్, వివిధ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

