కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో ఆర్టీసీ బస్సు (Ashwapuram RTC Bus) బీభత్సం సృష్టించింది. కొత్తగూడెం డిపో నుంచి మణుగూరు వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు, స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపైకి రాగానే ప్రమాదానికి గురైంది. డ్రైవర్ అజాగ్రత్త, తప్పిదం కారణంగా వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో బస్సు ఒక్కసారిగా రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌పైకి దూసుకెళ్లింది.
ప్రయాణంలో ఉండగా బస్సు ఒక్కసారిగా తీవ్రమైన కుదుపునకు గురికావడంతో లోపల ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో అర్థంకాక కంగారుగా కిందకు దిగి చూసిన ప్రయాణికులకు షాకింగ్ దృశ్యం కనిపించింది. డివైడర్‌ను బలంగా ఢీకొట్టడంతో బస్సు చక్రాలు ఏకంగా గాల్లో తేలియాడుతూ ఉండటంతో వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
డివైడర్‌పైకి ఎక్కినప్పటికీ ప్రాణనష్టం తప్పడంతో పెద్ద ముప్పు తొలిగిపోయింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆ మార్గంలో ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా చర్యలు చేపడుతూ, బస్సులోని ప్రయాణికులను ప్రత్యామ్నాయ వాహనాల్లో మణుగూరుకు పంపించే ఏర్పాట్లు చేశారు.

