కలం, తెలంగాణ బ్యూరో: ఎల్‌నినో (El Nino) ప్రభావంతో తెలంగాణ (Telangana)లో ఇప్పటికే తక్కువ వర్షపాతం నమోదవుతూ, రిజర్వాయర్లలో నీటి మట్టాలు పడిపోతున్నాయి. ఈ ప్రభావం మున్ముందు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ స్టెల్లా హెచ్చరించారు. రాబోయే నెలల్లో ఈ ప్రభావం మోస్తరు స్థాయి నుంచి తీవ్ర స్థాయికి చేరే అవకాశముందని, ఇండియన్ ఓషన్ ‘డై పోల్’ తటస్థంగా కొనసాగే అవకాశముండటంతో ఎల్‌నినో ప్రభావం తగ్గే పరిస్థితులు కనిపించడం లేదన్నారు.
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఇటీవల నియమించిన కమిటీ తొలి సమావేశం ప్రజాభవన్‌లో బుధవారం జరిగింది. దాదాపు 25 శాఖల నుంచి అధికారులు హాజరై శాస్త్రీయ వివరణలు ఇచ్చారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌నినోను ఎదుర్కోడానికి ఆల్టర్నేట్గా స్టేట్ కంటింజెన్సీ ప్రణాళికను విడుదల చేయనున్నది.
రానున్న రోజుల్లో కరెంట్ కష్టాలు!
ఎల్‌నినో ప్రభావం కొనసాగితే వచ్చే వేసవిలో ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతాయని, నీటి కొరత మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ డైరెక్టర్ వివరించడంతో విద్యుత్ శాఖ సైతం అలర్టయింది. ఆ శాఖ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ మాట్లాడుతూ.. జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గడం, విద్యుత్ డిమాండ్ పెరగడం, గరిష్ఠ వినియోగ సమయాల్లో విద్యుత్ కొరత వంటి సవాళ్లు ఎదురవుతున్నాయని వివరించారు. విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవడం, సోలార్ ఎనర్జీని విస్తరించడం, సమగ్ర ఇంధన ప్రణాళికను అమలు చేయడం అవసరమని సూచించారు.
నీటి కటకట తప్పదా..?
నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్ మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణా బేసిన్లలోని రిజర్వాయర్లలో స్టోరేజీ, ఇన్‌ఫ్లో గురించి వివరిస్తూ నార్మల్‌కంటే చాలా తక్కువగా ఉన్నాయన్నారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో వర్షపాత అంచనాలను నిరంతరం పరిశీలిస్తున్నామని, తెలంగాణకు వచ్చే నీటి లభ్యతపై ఎలాంటి ప్రభావం ఉంటుందో అంచనా విశ్లేషిస్తున్నామన్నారు.
భారీగా తగ్గనున్న వరి సాగు
– వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం సమానంగా ఉండడం లేదన్నారు. వర్షపాతం, భూగర్భ జలాలు, సాగునీటి లభ్యతను సమగ్రంగా విశ్లేషిస్తూ పంటల సరళిలో వచ్చే మార్పులను అంచనా వేస్తున్నామని తెలిపారు. గతేడాదితో పోలిస్తే భూగర్భ జలమట్టం సుమారు ఒక మీటరు తగ్గిందన్నారు. ఈ ఏడాది వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే అవకాశం ఉండగా, పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు, కూరగాయలు వంటి తక్కువ నీటి అవసరమున్న పంటల సాగు పెరిగే అవకాశముందని తెలిపారు. రైతులకు జిల్లా వారీగా శాస్త్రీయ పంటల సలహాలు, మార్గదర్శకాలను ఇస్తున్నామన్నారు.
మాన్-యానిమల్ కాన్ఫ్లిక్ట్
– పంచాయతీరాజ్ కమిషనర్ దివ్యరాజన్ మాట్లాడుతూ.. వర్షపు నీటి సంరక్షణ, ఫామ్ పాండ్స్, సామూహిక నీటి సంరక్షణ నిర్మాణాలు, ఉద్యాన పంటల ప్రోత్సాహం వంటి సమన్వయ కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వాతావరణ అనుకూలతను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
– దీర్ఘకాలిక వర్షాభావం, అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత కారణంగా అటవీ వ్యవస్థపైనా ప్రభావం పడుతుందని, మనుషులు-వన్యప్రాణుల (మాన్-యానిమల్ కాన్ఫ్లిక్ట్) ఘర్షణలు పెరిగే ప్రమాదముందని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ వినయ్ కుమార్ హెచ్చరించారు.
23 జిల్లాల్లో లోటు వర్షపాతం
జూన్ 1 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో సగటున 30% లోటు వర్షపాతం నమోదైందని చిన్నారెడ్డి తెలిపారు. 10 జిల్లాల్లో సాధారణం ఉంటే మిగలిన 23 జిల్లాల్లో లోటులోనే ఉందన్నారు.
– పసిఫిక్ మహాసముద్రంలోని మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అర డిగ్రీ సెల్సియస్ పెరిగి కొన్ని నెలలు కొనసాగితే దానిని ఎల్నినోగా పరిగణిస్తామన్నారు. వేడి సముద్ర జలాలు తూర్పు వైపు కదలి నైరుతి రుతుపవనాలను బలహీనపరుస్తాయన్నారు.
– ఆ ప్రభావమే ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నామన్నారు. శాస్త్రీయ విశ్లేషణ, సమగ్ర ప్రణాళిక, సమన్వయంతో ఈ ప్రతికూల ప్రభావాన్ని అధిగమించాలన్నారు. నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని సూచించారు.

