కలం, వెబ్‌డెస్క్: తిరుమల (Tirumala) లోని ఓ ఆలయంలో జరిగిన విగ్రహం చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి సుధీర్ఘ దర్యాప్తు అనంతరం దొంగను పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద ఉన్న ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామి (Hanuman Temple) విగ్రహం చోరీకి గురైంది. మంగళవారం అర్థరాత్రి సమయంలో ఆలయంలోకి చొరబడిన ఒక దుండగుడు, విగ్రహాన్ని ఒక గుడ్డలో దాచుకుని తాపీగా అక్కడ నుంచి పరారయ్యాడు. పవిత్ర పుణ్యక్షేత్రంలో స్వామివారి విగ్రహం మాయం కావడంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆలయంలోని సీసీటీవీ కెమెరాల్లో ఈ చోరీ దృశ్యాలు రికార్డ్ అవ్వడంతో స్థానిక పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు.
ఒంగోలులో నిందితుడి అరెస్ట్
ఘటనపై నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణను వేగవంతం చేశారు. కెమెరాలో నమోదైన దృశ్యాల ద్వారా నిందితుడి ఆచూకీ గుర్తించిన పోలీసులు, చివరికి అతడిని ఒంగోలులో పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విగ్రహం చోరీకి గల కారణాలు, దీని వెనుక ఉన్న ముఠా వివరాలపై విచారణ జరుపుతున్నారు.

