నకిలీ డీఏపీ అక్రమ అమ్మకాలు.. ఏడుగురి అరెస్ట్

కలం, నాగర్ కర్నూల్: జిల్లాలోని తాడూరు, బిజినేపల్లిలో ఇటీవల వెలుగు చూసిన నకిలీ డీఏపీ ఎరువుల అక్రమ అమ్మకాల (Fake DAP Fertilizer Scam) కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని వెల్లడించారు. బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. జిల్లాలోని మహదేవునిపేటలో 110 నకిలీ డీఏపీ బస్తాలు, తాడూరు మండలం ఆకునెల్లికుదురు గ్రామంలో 80 నకిలీ డీఏపీ బస్తాలు పట్టుబడిన నేపథ్యంలో పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా నకిలీ డీఏపీ తయారీ కేంద్రాన్ని పోలీసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా అంబర్‌పేట పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలో నకిలీ డీఏపీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి బ్రోకర్ల ద్వారా జగదీష్ అనే వ్యక్తి సహకారంతో జిల్లాలో 3000కు పైగా నకిలీ డీఏపీ బస్తాలను విక్రయించినట్లు గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు. జిల్లాలోని పలు గ్రామాల్లో దాదాపు 500 నకిలీ డీఏపీ బస్తాలను సీజ్ చేసినట్లు వివరించారు. నకిలీ ఎరువుల సరఫరాలో పలువురు మధ్యవర్తుల పాత్ర ఉన్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. జిల్లాలోని పలు మండలాలకు నకిలీ డీఏపీ సరఫరా చేసినట్లు పోలీసుల విచారణలో తేలిందని తెలిపారు.

రైతులు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి పొందిన ఎరువుల దుకాణాల్లోనే ఎరువులు కొనుగోలు చేయాలని డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు సూచించారు. ఎరువులు కొనుగోలు చేసే ప్రతి రైతు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో నాగర్ కర్నూల్ వ్యవసాయ శాఖ డివిజన్ అధికారి పూర్ణచందర్ రెడ్డి, పోలీస్ సీఐ వెంకట్ రెడ్డి, వ్యవసాయ అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>