కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల (Jagtial) జిల్లా మెట్పల్లి మండలం చింతలపేట గ్రామంలో ఇటీవల హత్యకు గురైన కర్రే సునీత కుటుంబాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri) మంగళవారం పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చిన మంత్రి, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.4,12,500 విలువైన ఆర్థిక సహాయ చెక్కును అందజేశారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో పాటు, మృతురాలి కుమారుల విద్య పూర్తయ్యే వరకు వారి చదువు బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి ప్రకటించారు. భవిష్యత్తులో వారికి ఉద్యోగ అవకాశాల కల్పనలో కూడా ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. కర్రే సునీత హత్య కేసులో నిందితులు ఎవరైనా, ఎంతటి వారైనా చట్టం ముందు సమానమేనని మంత్రి స్పష్టం చేశారు. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని చట్టపరంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అశోక్ కుమార్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి రాజ్ కుమార్, మెట్పల్లి డివిజన్ రెవెన్యూ అధికారి నరసింహరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

