దుమ్ముగూడెంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆందోళన

కలం, ఖమ్మం బ్యూరో: దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న ‘నీట్’ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ డిమాండ్ చేసింది. నీట్ లీకేజీకి నిరసనగా, కేంద్ర మంత్రి రాజీనామా కోరుతూ ఢిల్లీలోని పార్లమెంటు ఎదుట శాంతియుతంగా ఆందోళనకు బయలుదేరిన విద్యార్థులు, యువకులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జి చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ మంగళవారం భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం (Dummugudem Protest) మండల కేంద్రంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.

​ఈ సందర్భంగా పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ మాట్లాడుతూ.. సంవత్సరాల తరబడి వేలకు వేలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటూ రాత్రింబవళ్లు కష్టపడి నీట్ పరీక్షకు సిద్ధమైన లక్షలాది మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం, విద్యాశాఖ చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు. పేపర్ లీకేజీల వల్ల అర్హులైన పేద, మధ్యతరగతి విద్యార్థుల జీవితాలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

​దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువకులు రోడ్డెక్కి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఆయనతో రాజీనామా చేయించకపోవడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఢిల్లీలో హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులపై లాఠీఛార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసేంతవరకు విద్యార్థులు, యువకులు పోరాటాన్ని ఉధృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ​ఈ నిరసన కార్యక్రమంలో పీవైఎల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>