కలం, నల్లగొండ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై నల్లగొండ (Nalgonda ) జిల్లాలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న బాధ్యులపై వెంటనే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఈ వ్యవహారంపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా న్యాయవాదులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు.
నల్లగొండ జిల్లా న్యాయస్థానం ప్రధాన ద్వారం ఎదుట లాయర్లు నల్ల బ్యానర్లు చేతబూని కేంద్ర ప్రభుత్వానికి, విద్యాశాఖకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఢిల్లీలో శాంతియుతంగా పార్లమెంట్ ముట్టడికి బయలుదేరిన విద్యార్థులు, యువత, వారి తల్లిదండ్రులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్ను లాయర్లు తీవ్రంగా ఖండించారు.
శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం గౌరవించాలని, అరెస్టు చేసిన విద్యార్థులను ఎటువంటి షరతులు లేకుండా వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు, యువత చేపడుతున్న న్యాయబద్ధమైన ఉద్యమాలకు నల్లగొండ జిల్లా న్యాయవాద లోకం సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దమనకాండ ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు మల్లేపల్లి ఆదిరెడ్డి, జి. మోహన్ తదితర ప్రముఖ న్యాయవాదులు, పెద్ద సంఖ్యలో బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

