కలం, ఖమ్మం బ్యూరో: పోడు భూముల హక్కుల పరిరక్షణ, గిరిజనుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, రైతులెవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు (MLA Payam Venkateswarlu) స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం వేములూరు, మనుబోతులపాడు, గొందిగూడెం గ్రామాల్లో ఇటీవల చోటుచేసుకున్న ఘటనల్లో బాధితులైన గిరిజన రైతులను (Podu Farmers) మంగళవారం ఆయన స్వయంగా పరామర్శించారు.
మొదటగా వేములూరు పరిధిలో జరిగిన ఘటనలో గాయపడిన పోడు రైతులను ఎమ్మెల్యే పరామర్శించి, బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని స్థానిక సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడికి బాధ్యతలు అప్పగించి, ప్రత్యేక వాహనంలో భద్రాచలం ఆసుపత్రికి పంపించారు. అనంతరం మనుబోతులపాడు చేరుకున్న ఎమ్మెల్యే, అక్కడ ఫారెస్ట్ అధికారుల దాడికి గురైన గిరిజన బాధితులతో మాట్లాడారు.
అటవీ శాఖ అధికారులు గిరిజన మహిళలపై బూట్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడికి తెగబడటాన్ని ఎమ్మెల్యే పాయం తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా సంపత్ అనే అటవీ అధికారి ఒక గిరిజన మహిళ జుట్టు పట్టుకుని లాగి, కిందపడేసి కాలితో తొక్కడం అత్యంత అమానుషమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులపై దురుసుగా ప్రవర్తించిన వారిపై ప్రభుత్వం ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుందని వెల్లడించిన ఎమ్మెల్యే, దాడికి పాల్పడిన అధికారి సంపత్‌ను తక్షణమే సస్పెండ్ చేయడంతో పాటు, బాధ్యులైన ఎఫ్ఆర్ఓతో సహా మరో ముగ్గురు అధికారులకు మెమోలు జారీ చేసినట్లు తెలిపారు.
భవిష్యత్తులో గిరిజనుల పట్ల చట్టవ్యతిరేకంగా, అమానుషంగా ప్రవర్తించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు హెచ్చరించారు. పోడు భూముల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఓరుగంటి రమేష్ బాబు, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

