కలం, వెబ్ డెస్క్ : ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను మోసం చేస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు (Ramchander Rao) తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తు కోసం వంద రూపాయలు, అలాగే ఈఎండీ డిపాజిట్ కింద పది వేల రూపాయలు వసూలు చేయడం అన్యాయమని ఆయన మండిపడ్డారు. ఇల్లు లేని పేదల కోసమే ఈ పథకం అని చెబుతూనే, వారి నుంచి ముందస్తుగా పది వేల రూపాయలు వసూలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు.
లక్షలాది మంది పేదలు దరఖాస్తు చేసుకుంటుంటే, కేవలం 7,640 ఫ్లాట్లు మాత్రమే ఇవ్వడం ప్రజలను వంచించడమేనని రాంచందర్ రావు పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పేరుతో ముప్పై రెండు వేల రూపాయల చొప్పున డిపాజిట్లు తీసుకుని మోసం చేసిన విధానాన్ని ఇది గుర్తు చేస్తోందని విమర్శించారు. హైదరాబాద్ నగరంలో గత ప్రభుత్వాల హయాంలో నిర్మించిన అనేక ఇళ్లు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయని, జవహర్‌నగర్‌లో ఇరవై అంతస్తుల భవనాల్లో వందలాది ఫ్లాట్లు నిర్మించినా ఇప్పటివరకు పేదలకు కేటాయించలేదని ధ్వజమెత్తారు.
గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నిర్మించిన సద్భావన టౌన్‌షిప్, పోచారం, జవహర్‌నగర్‌లోని అభిమాన్ టౌన్‌షిప్, చందానగర్, గాజులరామారంలోని సహీరా టౌన్‌షిప్‌లలో రాజీవ్ స్వగృహ ఇళ్లు ఇప్పటికీ లబ్ధిదారులకు అందలేదని ఆయన గుర్తు చేశారు. ఈ రాజీవ్ స్వగృహ ఇళ్లపై సీబీసీఐడీ విచారణ జరిపిస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారుకు నిజంగా పేదలకు ఇళ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే, కొద్దిమందికి మాత్రమే ఇచ్చి ప్రచారం చేసుకోవడం మాని, అర్హులైన వారందరికీ ఇళ్లు కేటాయించాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు.

