కలం, వెబ్ డెస్క్: ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం (Tammineni Sitaram) కోసం పోలీసులు గాలిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం చాపురం గ్రామ పంచాయతీ పరిధిలో రూ.4 కోట్ల విలువైన భూమిని తమ్మినేని సీతారాం కబ్జా చేసినట్లు రుజవైంది. ఈ మేరకు ఆయనతో పాటు భార్య వాణి, కుమారుడిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ ఖాయమని భావించిన తమ్మినేని.. కుటుంబంతో సహా రాత్రికి రాత్రే పరారైనట్లు తెలుస్తోంది. దీంతో, ఆయన కోసం వెతుకుతున్నారు.
సొంత కార్లు వదిలేసి..
తనను ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చని భావించిన తమ్మినేని సీతారాం సొంత కార్లు అక్కడే వదిలేసి.. ప్రైవేటు కారులో భార్య, కుమారుడితో వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అంతేగాకుండా, లోకేషన్ ట్రాక్ చేయడానికి వీల్లేకుండా.. తమ ఫోన్లను ఇంట్లోనే పెట్టి వెళ్లడం గమనార్హం. సీసీ కెమెరాల ఆధారంగా వారి వెళ్లిన రూట్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
బతికుండగానే చనిపోయాడంటూ..
పోలీసుల వివరాల ప్రకారం.. కనక లింగేశ్వరరావు అనే వ్యక్తి చాలా సంవత్సరాల కిందటే చాపురం గ్రామంలో 900 చదరపు గజాల భూమి కొనుగోలు చేశారు. ఉద్యోగరీత్యా ఆయన హైదరాబాద్‌లోనే ఉంటుండటంతో.. ఈ ఖాళీ స్థలంపై అప్పటి స్పీకర్ తమ్మినేని సీతారాం కన్ను పడింది. లింగేశ్వరరావు చనిపోయినట్లు డెత్ సర్టిఫికేట్ సృష్టించి, ఆయనకు వారసురాలిగా ఒడిశాకు చెందిన మహిళను చూపిస్తూ నకిలీ సర్టిఫికేట్లు తయారు చేయించారు.
అనంతరం, హిరమండలం సబ్ రిజిస్ట్రార్ సాయంతో భూమిని తన కుమారుడి పేరు మీదకు సీతారం ఎక్కించేశారు. ఇటీవల, వాస్తవ యజమాని లింగేశ్వరరావు కుమారుడు స్థలం వద్ద నిర్మాణాలు చేస్తుండగా.. గొడవ జరిగింది. వివరాలు ఆరా తీస్తే.. భూ కబ్జా బాగోతం వెలుగులోకి వచ్చింది.

