కలం, తెలంగాణ బ్యూరో : BJP Operation Akarsh | బీజేపీ అగ్రనేతలు నితిన్ నబిన్, జేపీ నడ్డా, అభయ్ పాటిల్ హైదరాబాద్ టూర్‌తో రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చ మొదలైంది. శ్రావణ మాసంలో బీజేపీలోకి కాంగ్రెస్, బీఆర్ఎస్ అగ్రనేతలు చేరతారని.. ఇప్పటికే టచ్‌లో ఉన్నారని అభయ్ పాటిల్ కామెంట్ చేయడంతో ఎవరా నేతలు?.. అనే ఊహాగానాలు మొదలయ్యాయి. బీజేపీతో సంప్రదింపుల్లో ఉన్నారనే కామెంట్ చేయడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల్లోనూ ఒకింత ఆసక్తి పుట్టించింది.
నిజంగా రెండు పార్టీల నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా?.. రెండు పార్టీలతో మైండ్ గేమ్ వ్యూహంలో భాగంగా ఈ కామెంట్లను కమలనాథులు చేశారా?.. ఆధ్యాత్మికంగా పవిత్రంగా భావించే శ్రావణమాసం ఈసారి రాజకీయంగా సంక్షోభ మాసంగా మారుతుందా?.. ఇది భవిష్యత్ కార్యాచరణ ప్రకటనా?.. లేక ప్రత్యర్థి పార్టీల్లో మానసిక ఒత్తిడి పెంచే ఎత్తుగడా?.. ఇలాంటి అనుమానాలు కొనసాగుతున్నాయి. బీజేపీ (Telangana BJP)లోని గ్రూపు తగాదాలను కొలిక్కి తెచ్చిన అభయ్ పాటిల్ ఇప్పుడు సామాజికపరంగా, ప్రాంతీయ పలుకుబడి ఉన్న నేతలను ఆకర్షించే వ్యూహానికి పదును పెట్టారన్నది కమలనాథుల వాదన.
‘ఆపరేషన్ ఆకర్ష్’లో చిక్కే నేతలెవరు?
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ఇంకా రెండున్నరేండ్ల సమయం ఉన్నా అన్ని ప్రధాన పార్టీలతో పొలిటికల్ యాక్టివిటీ ఊపందుకుంది. గెలుపు కోసం మూడు పార్టీలూ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. పోటాపోటీగా విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నాయి. రాజకీయంగా పైచేయి సాధించేందుకు పడరాని పాట్లు పడుతున్నాయి.
బీజేపీ సంస్థాగతంగా బలోపేతం కావడానికి అవసరమైన యాక్షన్ ప్లాన్‌ను అమలు చేస్తూనే రాష్ట్ర స్థాయిలో ఫేస్ వ్యాల్యూ ఉన్న ఇతర పార్టీల నేతలకు గాలం వేయాలని చేస్తున్నది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి అభయ్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు కొత్త ఊహాగానాలకు దారితీశాయి. శ్రావణ మాసంలో చేరికలపై సంచలన ప్రకటన చేశారు. అభయ్ పాటిల్ అంటున్న ఆ నేతలు ఎవరు? కాంగ్రెస్, బీఆర్ఎస్ ను విడిచి కమలం తీర్థం పుచ్చుకునేవాళ్లు ఎవరు? బీజేపీ ‘ఆపరేషన్ ఆకర్ష్’ (BJP Operation Akarsh) కు చిక్కేవాళ్లు ఎవరు? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.
బీజేపీ మెయిన్ టార్గెట్ బీఆర్ఎస్?
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు. మరికొందరు సొంత పార్టీ యాక్టివిటీస్‌లో యాక్టివ్‌గా లేరనే ఆరోపణలూ ఉన్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నుంచి బీజేపీలో జరిగే చేరికలకంటే సంస్థాగతంగా, మానసికంగా వీక్‌గా ఉన్న బీఆర్ఎస్ లీడర్లే బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు చిక్కుతారనే అభిప్రాయం కమలనాథుల్లో వ్యక్తమవుతున్నది. రాజకీయ భవిష్యత్తుపై ఉండే ఆందోళన, కేసీఆర్ బయటకు రాకపోవడంతో గులాబీ పార్టీకి ఫ్యూచర్ ఉండదనే అభిప్రాయం, క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ సంస్థాగతంలో బలంగా లేదనే భావన, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కష్టమేననే అనుమానం.. ఇవన్నీ బీజేపీవైపు చూసే అవకాశాలున్నాయనే మాటలు బీజేపీ నుంచే వినిపిస్తున్నాయి. శ్రావణ మాసంలో ఆపరేషన్ ఆకర్ష్ ను ముమ్మరం చేసిన తర్వాత బీజేపీ ఫస్ట్ ఛాయిస్, టార్గెట్ బీఆర్ఎస్ మాత్రమే అనేది కమలనాథుల నుంచి వస్తున్న సమాచారం.
బలపడుతున్నా.. ఫేస్ వ్యాల్యూ లేదు..
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో ఎనిమిది మంది ఎంపీలు గెలవడంతో బీజేపీలో ఒకింత ఆత్మవిశ్వాసం పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రత్యామ్నాయ శక్తిగా నిలవడం, అధికారంలోకి రావడం.. ఈ లక్ష్యాలు నెరవేరాలంటే కేవలం కేడర్‌తో సరిపోదని, జిల్లాల్లో ప్రభావం ఉన్న నాయకులను ఆకర్షించాల్సిందేనన్నది బీజేపీ ఆలోచన. దానితో పాటు ప్రత్యర్థి పార్టీల్లో అనిశ్చితి వాతావరణాన్ని సృష్టించడమూ ఒక అవసరంగా భావిస్తున్నది.
ఒకవైపు పార్టీలో వర్గాలుగా విడిపోయినవారిని కన్విన్స్ చేసి ఒక్కటి చేసినా సామాజికవర్గాల రీత్యా, ఓటు బ్యాంకును ప్రభావితం చేసే జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపే సీనియర్ లీడర్లవైపు బీజేపీ చూస్తున్నది. డీలిమిటేషన్ జరిగితే ఈసారి అదే స్థానం ఉంటుందో లేక మరో నియోజకవర్గానికి షిప్ట్ కావాల్సి ఉంటుందో, టికెట్ వస్తుందో రాదో.. ఇలాంటి అనుమానాలతో ఇప్పటి నుంచే సేఫ్ జోన్‌ను ఎంచుకోవడం కొద్దిమందికి అనివార్యమైంది. ఇలాంటి వీక్‌నెస్‌నే బీజేపీ అంచనా వేస్తున్నది. దానికి తగినట్లుగా రాయబారాలు నడపాలనుకుంటున్నది.
నెలలో తేలనున్న బీజేపీ గేమ్ ప్లాన్
నిజంగా ప్రత్యర్థి పార్టీల నుంచి సీనియర్ నేతలు బీజేపీలో చేరుతున్నారా?.. లేక ఆ పార్టీల్లో మానసిక ఒత్తిడి పెంచే మైండ్ గేమ్‌లో భాగంగా అభయ్ పాటిల్ ప్రకటన చేశారా?.. ఈ సందేహాలకు శ్రావణ మాసం పూర్తయిన తర్వాత క్లారిటీ వస్తుంది. ఒకవేళ అభయ్ పాటిల్ కామెంట్లు నిజంగా ఆ పార్టీ వ్యూహమే అయినట్లయితే.. ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించాలని భావించడమే బీజేపీ వీక్‌నెస్‌కు నిదర్శనమని, సొంత పార్టీలో సరైన లీడర్ లేకనే ఇతర పార్టీలపై ఆధారపడాల్సి వస్తున్నదనే మాటలు కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల నుంచి వినిపిస్తున్నాయి.
శ్రావణమాసం నాటికి చేరికలు లేకపోతే ఆ పార్టీ బలహీనతగా, అసమర్ధతగానే పరిగణించాల్సి వస్తుందని.. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆ పార్టీ మరింత వీక్ అవుతుందని కాంగ్రెస్, బీఆర్ఎస్ లీడర్లు అంటున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్‌పైనే బీజేపీ ఫోకస్ పెడుతున్నదనేదానికి ఒకరిద్దరు లీడర్ల నుంచి “నేను పార్టీ మారడంలేదు.. ఆ ఉద్దేశమూ లేదు..” అనే వివరణే నిదర్శనం.
Read Also: ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇసుక దందా
Follow Us On: Instagram

