కలం, వెబ్ డెస్క్ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament) రెండో రోజు కూడా అత్యంత ఉత్కంఠభరితంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలని ఇండియా కూటమి వ్యూహాత్మకంగా నిర్ణయించింది. మొదటి రోజు లాగే రెండో రోజు కూడా సభలో ఈ అంశంపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ అంశంపై ప్రభుత్వం తక్షణమే సమాధానం చెప్పాలని విపక్ష నేతలు పట్టుబడుతున్నారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను సభ ముందుకు తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా సుప్రీంకోర్టులో పెరుగుతున్న కేసుల బ్యాక్‌లాగ్‌ను తగ్గించడానికి వీలుగా న్యాయమూర్తుల సంఖ్యను 34 నుండి 38కి పెంచేందుకు ఉద్దేశించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు, 2026ను ప్రభుత్వం ప్రతిపాదించింది.
దీంతో పాటు జాతీయ గేయం వందేమాతరానికి సంబంధించిన అవమానాలను అడ్డుకునేందుకు ఉద్దేశించిన నివారణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా దేశ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై కూడా ఈ రోజు ఉభయ సభల్లో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Read Also: రైతుల ఢిల్లీ మార్చ్.. శంభూ సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్తత!
Follow Us On: Sharechat

