చెన్నై చెస్ టోర్నీ: వరల్డ్ ఛాంపియన్‌కు షాకిచ్చిన అర్జున్!

కలం, స్పోర్ట్స్ : చెన్నై గ్రాండ్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ క్లైమాక్స్‌కు చేరింది. ఐదో రౌండ్‌లో భారత స్టార్ ప్లేయర్ అర్జున్ ఎరిగైసి (Arjun Erigaisi) అద్భుత విజయం సాధించారు. ప్రపంచ ఛాంపియన్ డి. గుకేష్‌ను ఓడించి.. టోర్నీలో సంయుక్త అగ్రస్థానానికి దూసుకెళ్లారు. కేవలం రెండు రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్న ఈ తరుణంలో టైటిల్ రేసు ఉత్కంఠగా మారింది. మంగళవారం జరిగిన ఈ ఐదో రౌండ్ మ్యాచ్ ఒక ప్రత్యేకతతో ప్రారంభమైంది. తమిళనాడుకు చెందిన ఏడేళ్ల చిన్నారి, అత్యంత పిన్న వయస్కుడైన అరేనా ఫిడే మాస్టర్ జె. జెషువా తొలి పావును కదపడంతో అర్జున్, గుకేష్ మధ్య హోరాహోరీ పోరు మొదలైంది.

నల్లటి పావులతో ఆడిన అర్జున్ ఎరిగైసి ఆరంభం నుండి చాలా పటిష్టంగా ఆడారు. మిడిల్ గేమ్‌లో గుకేష్ కొన్ని పొరపాట్లు చేశారు. ఆ తప్పులను అర్జున్ వెంటనే క్యాష్ చేసుకున్నారు. ఎంతో ఓపికగా ఆడుతూ గుకేష్‌పై ఒత్తిడి పెంచారు. చివరికి అర్జున్ పావు క్వీన్‌గా మారడం ఖాయమని తేలడంతో.. 63వ ఎత్తు వద్ద గుకేష్ తన ఓటమిని అంగీకరిస్తూ ఆట నుండి తప్పుకున్నారు. మరోవైపు, ఉజ్బెకిస్తాన్ గ్రాండ్ మాస్టర్ నోదిర్‌బెక్ అబ్దుసత్తోరోవ్ కూడా నల్లటి పావులతో అటాకింగ్ గేమ్ ఆడారు.

నోదిర్‌బెక్ దెబ్బకు భారత ప్లేయర్ నిహాల్ సరిన్ 38వ ఎత్తులోనే లొంగిపోయారు. తొలి రెండు రౌండ్లు గెలిచిన ఫ్రాన్స్ ప్లేయర్ అలీరెజా ఫిరౌజా.. ఈ రౌండ్‌లో డిమిత్రి ఆండ్రీకిన్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకున్నారు. అలాగే భారత ప్లేయర్ ఎం. ప్రణేష్, హాన్స్ నీమన్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా డ్రాగా ముగిసింది. ప్రస్తుతం అర్జున్ ఎరిగైసి, అలీరెజా ఫిరౌజా ఇద్దరూ 3.5 పాయింట్లతో సంయుక్తంగా మొదటి స్థానంలో ఉన్నారు. నోదిర్‌బెక్ అబ్దుసత్తోరోవ్ 3 పాయింట్లతో వీరి వెనుకే ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>