ఎల్‌నినో ఎఫెక్ట్.. సాగునీటిపై ప్రభుత్వం కీలక నిర్ణయం

కలం, ఖమ్మం బ్యూరో: ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడుతున్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఖరీఫ్‌లో నాగార్జునసాగర్, పాలేరు ఆయకట్టు పరిధిలో సాగునీరు అందించే పరిస్థితి లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం తాగునీటి అవసరాలకే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. సోమవారం ఖమ్మం కలెక్టరేట్‌లో ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావాన్ని శాస్త్రీయ అంచనాలు, క్షేత్రస్థాయి పరిస్థితులు, శాఖల సమన్వయంతో ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు.

జిల్లాలో ఇప్పటివరకు 35 శాతం వర్షపాతం లోటు నమోదైందని, దీంతో భూగర్భ జలాలు వేగంగా తగ్గుతున్నాయని అధికారులు వివరించారు. ఈ పరిస్థితుల్లో బోర్లపై ఆధారపడి వరి సాగు చేసి రైతులు నష్టపోవద్దని సూచించారు. వాస్తవ పరిస్థితులను రైతు వేదికల ద్వారా ప్రతి గ్రామంలో రైతులకు వివరించాలని అధికారులను ఆదేశించారు. గత ఏడాది, ప్రస్తుత ఏడాది నీటి లభ్యతపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని, ప్రత్యామ్నాయంగా గోదావరి జలాలను రాజీవ్ లింక్ కాలువ ద్వారా పాలేరు జలాశయానికి తరలించే అవకాశాలపై తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో నీటి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని తెలిపారు. వరి సాగును ప్రోత్సహించకుండా పెసర, మినుములు, కందులు, చిరుధాన్యాలు, ఆయిల్‌పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులను మళ్లించాలని సూచించారు. మండలాల వారీగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాబోయే ఏడాది పాటు తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు అమలు చేస్తున్నామని జిల్లా ప్రత్యేక అధికారి అనుదీప్ దురిశెట్టి, కలెక్టర్ దివాకర టి.ఎస్. వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>