కలం, నిజామాబాద్ బ్యూరో : కామారెడ్డి జిల్లా బీర్కూర్ (Birkoor )లో 8 నెలల చిన్నారిని బ్లేడ్ తో గాయాలు వేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో సంచలన విషయం బయటపడింది. పాపను బ్లేడ్ తో కాట్లు చేసి ముళ్ళ పొదల్లో వేసింది సొంత తండ్రే అని తేలింది.
వివరాల్లోకి వెళ్తే.. టేకు సతీష్ మొదటి భార్య శైలజకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. కాగా, శైలజ సొంత చెల్లెలు అయిన సంధ్యను టేకు సతీష్ రెండేళ్ల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. సంధ్యకు ఒక కూతురు వైష్ణవి జన్మించింది. అప్పటి నుంచి చిన్న భార్యతో గొడవలు మొదలయ్యాయి. ఐదు నెలల క్రితం రెండో భార్య సంధ్యతో సతీష్ విడాకులు తీసుకున్నారు. పాప వైష్ణవిని తండ్రి టేకు సతీష్ వద్దనే ఉంచాలని కుల పెద్దలు నిర్ణయించారు. కుటుంబ విభేదాలు, పోషణ భారంగా మారిందని భావనతో రెండో భార్య కూతురు వైష్ణవి అడ్డు తొలగించుకోవాలని తండ్రి టేకు సతీష్, మొదటి భార్య శైలజ కుట్ర పన్నారు.
దీంతో చిన్నారి శరీరంపై కిరాతకంగా బ్లేడ్ తో గాయాలు చేశారు. ఈ క్రమంలోనే చిన్నారి ఏడుపు ఆగిపోవడంతో చనిపోయిందని భావించి అర్థరాత్రి పొదల్లో వదిలేసి ఇంటికి వచ్చేశారని డీఎస్పీ విఠల్ రెడ్డి తెలిపారు. మరుసటి రోజు చిన్నారి కనిపించడం లేదని తండ్రి టేకు సతీష్, సవతి తల్లి శైలజ నటించారు. అయితే రెండో భార్య సంధ్య పోలీసులు పెద్ద మనుషులకు ఫిర్యాదు చేయడంతో కుల పెద్దలు నిలదీశారు. పాపను తీసుకువచ్చి కుక్కలు ఎత్తుకెళ్లినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. అప్పటికి పాపకు ప్రాణం ఉండటంతో గమనించిన కులస్తులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు విచారణ చేపట్టి తండ్రి సతీష్, సవతి తల్లి శైలజ ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

