కార్మికుల గళం.. కనీస వేతనం డిమాండ్

కలం, కరీంనగర్ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ(AITUC) ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. రజిత మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 వేల మంది కార్మికులు మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం వారికి నెలకు కేవలం రూ.3 వేల వేతనం మాత్రమే చెల్లిస్తున్నారని, ఇది వారి జీవనానికి ఏమాత్రం సరిపోవడం లేదని అన్నారు.

విద్యార్థులకు వారంలో మూడు రోజులు కోడిగుడ్లు అందించాలనే నిబంధన ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఒక్కో గుడ్డుకు రూ.6 మాత్రమే చెల్లిస్తోందని, మార్కెట్‌లో గుడ్డు ధర రూ.8 వరకు ఉందని పేర్కొన్నారు. దీంతో కార్మికులు తమ సొంత డబ్బులతో విద్యార్థులకు భోజనం అందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల వేతనాల పెంపు, వంటకు అవసరమైన సరుకుల సరఫరా, గ్యాస్ సౌకర్యం వంటి సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ మాట్లాడుతూ, విద్యార్థులకు అల్పాహారం, ప్రభుత్వ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని విమర్శించారు. మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ.10 వేల కనీస వేతనం ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీని ప్రభుత్వం నేటికీ అమలు చేయలేదని ఆరోపించారు. కేంద్ర కార్మిక సంఘాలు కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నాయని తెలిపారు. కూరగాయల ధరలు పెరగడం, గ్యాస్ సిలిండర్ సమస్యలు, తక్కువ వేతనాలతో మధ్యాహ్న భోజన కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బొజ్జ సాయిలు, ఏఐటీయూసీ నాయకులు అల్లపు రాజు, హల్య తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>