కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య ఉద్యోగాల భర్తీ అంశంపై రాజకీయ వేడి మరింత పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు కల్పించిన ఉద్యోగాలపై రామగుండం ఎమ్మెల్యే (Ramagundam MLA) మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ (Raj Thakur) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బహిరంగ సవాల్ విసిరారు. సోమవారం రామగుండంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 70,664 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన అధికారిక గణాంకాలు, ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 70 వేల ఉద్యోగాలు ఇస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన రాజ్ ఠాకూర్.. ఇప్పుడు అధికారిక లెక్కలతో వాస్తవాలు నిరూపించామని అన్నారు. కేటీఆర్ తన మాటకు కట్టుబడి రాజకీయ సన్యాసం తీసుకుంటారా? లేక నిరుద్యోగ యువతకు, తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెబుతారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీలు కుమ్మక్కై కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఎమ్మెల్యే ఆరోపించారు. ప్రజలను, నిరుద్యోగులను తప్పుదోవ పట్టించే రాజకీయాలను తెలంగాణ సమాజం అంగీకరించదని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా, రిజర్వేషన్ నిబంధనలను పాటిస్తూ త్వరలోనే అధికారిక జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీని ద్వారా మరిన్ని ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చెప్పారు. ఈ సమావేశంలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, స్థానిక కార్పొరేటర్లు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

