కలం, నల్లగొండ బ్యూరో: ప్రాజెక్టుల్లో ఉన్న నీరు కేవలం తాగునీటికి మాత్రమే సరిపోతుందని, వర్షాలు రాకుంటే వచ్చే జులై వరకు తాగునీటి సమస్య ఏర్పడే ప్రమాదం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం నల్లగొండ కలెక్టరేట్ ఆవరణలోని ‘ఉదయాదిత్య భవన్’లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల మంత్రి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనే సంసిద్ధత, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహంపై ఉమ్మడి జిల్లా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
సమన్వయంతో అవగాహన: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా కలవరపెడుతున్న ‘ఎల్ నినో’ ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో తాగునీరు, విద్యుత్తు, వ్యవసాయ రంగాల్లో తీవ్ర ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. భూగర్భ జల, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు సమన్వయంతో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైతులు పంటల మార్పిడి చేస్తూ, ఆరుతడి పంటల వైపు వెళ్లేలా చూడాలని, ఇప్పటికే వరి వేసిన రైతులను ఆదుకుంటూనే, సాగునీటి కోసం కొత్తగా బోర్లు వేయకుండా నియంత్రించాలన్నారు. తాగునీటికే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
వరి సాగు చేయనీయొద్దు: మంత్రి ఉత్తమ్
నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ‘సూపర్ ఎల్ నినో’ ప్రభావం తీవ్రంగా ఉన్నందున రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి సాగు చేయొద్దన్నారు. ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడం, వర్షపాతం తగ్గడం వంటి వాస్తవ పరిస్థితులను రైతులకు వివరించాలన్నారు.
ఎస్ఎల్బీసీ, డిండితో పాటు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను తమ హయాంలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దేవాదుల ఫేజ్-6 ద్వారా తుంగతుర్తి నియోజకవర్గానికి గోదావరి జలాలు అందిస్తామన్నారు. డిండి ప్రాజెక్టు పనులు, దున్నపోతుల గండి, బస్వాపూర్ నిర్మాణాన్ని వేగవంతం చేస్తామన్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజాప్రతినిధులకు, మీడియాకు వాస్తవ పరిస్థితులను మంత్రి వివరించారు.
ఆగస్టు 2028 నాటికి ఎస్ఎల్బీసీ పూర్తి: మంత్రి వెంకటరెడ్డి
రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో 600 మీటర్లు పూర్తయ్యాయని, ఆగస్టు 2028 నాటికి ఇది పూర్తయితే ఉమ్మడి జిల్లా మొత్తం సస్యశ్యామలమవుతుందన్నారు. తాగునీటి అవసరాల కోసం ఉదయసముద్రంలో నీళ్లు నింపాలని, మూసీ నుంచి తిప్పర్తి మండలానికి సాగునీటిని వదలాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
దేవరకొండలోని మూడు మండలాల్లో తాగునీటి సమస్యపై మిషన్ భగీరథ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నల్లగొండ నియోజకవర్గంలో ఇప్పటికే వరి నాట్లు వేసిన రైతులకు ఇబ్బంది లేకుండా లో-వోల్టేజ్ సమస్యలు రాకుండా అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
ఈ ఉన్నత స్థాయి సమీక్షలో ప్రభుత్వ విప్లు వేముల వీరేశం, బీర్ల అయిలయ్య, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, కలెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారిణి దాసరి హరిచందన, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్, యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు, నల్గొండ రెవెన్యూ, స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్లు జె.శ్రీనివాస్, ప్రేమ్ కరణ్ రెడ్డి పాల్గొన్నారు.

