కలం, కరీంనగర్ బ్యూరో: విదేశాల్లోనూ బోనాలు, బతుకమ్మ వంటి తెలంగాణ సంప్రదాయ పండుగలను ఘనంగా నిర్వహిస్తూ భావితరాలకు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను పరిచయం చేయడం అభినందనీయమని మైత్రి గ్రూప్స్ వ్యవస్థాపకుడు కొత్త జైపాల్ రెడ్డి అన్నారు. దుబాయ్లో ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ (ETCA) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మహంకాళి అమ్మవారి బోనాల (Mahankali bonalu) మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విదేశీ గడ్డపై తెలంగాణ ఆత్మను సజీవంగా నిలుపుతున్న అసోసియేషన్ ప్రతినిధులను అభినందించారు.
యూఏఈలోని రాస్ అల్ ఖైమా మైత్రి ఫార్మ్స్లో నిర్వహించిన ఈ వేడుకలకు దుబాయ్, అబుదాబి, షార్జాతో పాటు పలు ఎమిరేట్స్ల నుంచి సుమారు 400 మంది తెలంగాణ ప్రవాసులు కుటుంబ సమేతంగా హాజరై భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈటీసీఏ ఆధ్వర్యంలో వరుసగా నాలుగో ఏడాది నిర్వహించిన ఈ వేడుకల్లో గౌరమ్మ పూజ, బోనాల సమర్పణ, కుంకుమార్చన, మహాహారతి, దీపోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పట్టు చీరలు ధరించిన మహిళలు తలపై బోనాలు మోసుకుంటూ నిర్వహించిన ఊరేగింపు, ఒగ్గు డోలు మోతలు, పోతురాజుల విన్యాసాలు విదేశీ నేలపై తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరించాయి.
ఈటీసీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు కిరణ్ కుమార్ పీచర, అధ్యక్షుడు జగదీష్ రావు మాట్లాడుతూ, విదేశాల్లో జన్మించిన భావితరాలకు తెలంగాణ పండుగల విశిష్టతను పరిచయం చేయడమే సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేసి, తెలంగాణ సంప్రదాయ వంటకాలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. విదేశాల్లో ఉన్నామనే భావన కలగకుండా స్వగ్రామంలో బోనాలు జరుపుకున్న అనుభూతిని ఈ కార్యక్రమం కల్పించిందని తెలంగాణ ప్రవాసులు నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ఎలిగేటి, ప్రధాన కార్యదర్శి రాణి కొట్ల, సంయుక్త కార్యదర్శి శేఖర్ గౌడ్ గుండవేని, కోశాధికారి తిరుమల్ రావు బీరెల్లి, మాజీ అధ్యక్షుడు రాధారపు సత్యం, కార్యవర్గ సభ్యులు, మహిళా విభాగ ప్రతినిధులు, వాలంటీర్లు, యూఏఈ నలుమూలల నుంచి వచ్చిన తెలంగాణ ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

