కలం, కరీంనగర్: కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో పాలన సాగిస్తోందని సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి (Chada Venkat Reddy) ఆరోపించారు. దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని విమర్శించారు. సోమవారం కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా కార్యవర్గ సభ్యుడు పిట్టల సమ్మయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు.
కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ప్రజల సంక్షేమాన్ని విస్మరించి దేశ సంపదను కొద్దిమంది చేతుల్లోకి వెళ్లేలా చేస్తోందని విమర్శించారు. గత 12 ఏళ్ల పాలనలో నల్లధనం రాలేదని, రెండు కోట్ల ఉద్యోగాల హామీ నెరవేరలేదని, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని, రాష్ట్రాలపై అదనపు భారం మోపుతున్నారని ఆరోపించారు. బీజేపీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సీపీఐ ఆధ్వర్యంలో ఆగస్టు నెలలో పాదయాత్రలు, సెప్టెంబరులో ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జీ, బాష్పవాయువు ప్రయోగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ప్రజా వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, బత్తుల బాబు, టేకుమల్ల సమ్మయ్య, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, నాగెల్లి లక్ష్మారెడ్డి, బోయిని తిరుపతి, న్యాలపట్ల రాజు తదితరులు పాల్గొన్నారు.

