కలం, స్పోర్ట్స్ : భారత క్రికెట్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల స్థానం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, వారు ఆడాలనుకున్నంత కాలం వారిని జట్టు నుంచి తొలగించడం ఎవరికైనా అసాధ్యమని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్, విరాట్ ఇద్దరూ గత 15 ఏళ్లుగా భారత క్రికెట్‌కు పిల్లర్లుగా నిలిచారు. వారు రాణిస్తున్నంత కాలం పక్కన పెట్టడం అస్సలు సాధ్యం కాదు. భవిష్యత్తు తరాల కోసం అవకాశాలు సృష్టించాల్సిందే. కానీ, బౌలర్లతో పోలిస్తే ఈ ఇద్దరు సీనియర్ బ్యాటర్లకు జట్టులో ప్రత్యేక రక్షణ ఉంటుందని అశ్విన్ అభిప్రాయపడ్డారు.
తమ అద్భుతమైన రికార్డులు, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్లే రోహిత్, విరాట్లు ఇంతటి ప్రభావాన్ని చూపిస్తున్నారని అశ్విన్ అన్నారు. రోహిత్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో 12 వేలకు పైగా పరుగులు చేశారు. వీరిద్దరిని చూడటానికే అభిమానులు స్టేడియాలకు వస్తారు. ఒకవేళ వీరిలో ఎవరిని తొలగించినా దేశవ్యాప్తంగా పెద్ద గొడవ జరుగుతుందని చెప్పారు. కానీ బౌలర్ల పరిస్థితి ఇలా ఉండదని అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశారు. మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ లాంటి బౌలర్లు ఎంతో సహకారం అందించినా, వారిని తొలగించడం సులువుగా మారుతోందన్నారు.
ఉదాహరణకు, సిరాజ్ చివరిసారిగా 2026 జూన్ 6న న్యూ చండీగఢ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టెస్టులో ఆడారు. అలాగే షమీ 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో దుబాయ్‌లో చివరి మ్యాచ్ ఆడారు. తన యూట్యూబ్ ఛానెల్ ‘యాష్ కీ బాత్’ లో మాట్లాడిన అశ్విన్.. షమీ, సిరాజ్ లేదా భువనేశ్వర్ వంటి బౌలర్లను ఎంపిక చేయకపోతే మహా అయితే కొంతమంది మాత్రమే ప్రశ్నిస్తారని అన్నారు. అదే బ్యాటర్ల విషయంలో జరిగే రచ్చ వేరేలా ఉంటుందని చెప్పారు. భారత క్రికెట్లో బ్యాటర్లకు దక్కే మద్దతు, గుర్తింపు బౌలర్లకు దక్కడం లేదని ఆయన స్పష్టం చేశారు.

