కలం, వరంగల్ బ్యూరో: పసుపు పంట రికార్డు స్థాయి ధరలు పలుకుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు నష్టాలను చవిచూసిన వారు.. తాజా ధరలతో సంబరపడుతున్నారు. ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలోని ఏనుమాముల, కేసముద్రం వ్యవసాయ మార్కెట్లలో పసుపు ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో మంచి లాభాలు ఆర్జిస్తున్నారు.
వారం రోజుల్లోనే పెరుగుదల..
గత బుధవారం కేసముద్రం మార్కెట్లో 306 బస్తాల పసుపు అమ్మకానికి రాగా, కాడి రకానికి గరిష్ఠంగా రూ.16,159, కనిష్ఠంగా రూ.10,300 ధర నమోదైంది. గోళా రకానికి గరిష్ఠంగా రూ.15,500, కనిష్ఠంగా రూ.11,101 పలికింది. సోమవారం నాడు 600 పైగా బస్తాలు మార్కెట్‌కు రాగా కాడి రకానికి రూ.15,555, గోళా రకానికి రూ.15 వేల వరకు ధర వచ్చింది. వారం వ్యవధిలోనే క్వింటాకు దాదాపు వెయ్యి రూపాయల మేర ధర పెరగడంతో పసుపు నిల్వ ఉంచిన రైతులకు అదనపు లాభం చేకూరింది.
ఒకప్పుడు రూ.5 వేలు మాత్రమే..
ఇటీవల జరిగిన పసుపు పంట వేలంలో కాడి (పాలిష్ చేసిన) రకం పసుపు క్వింటాకు గరిష్ఠంగా రూ.16,159, గోళా రకానికి రూ.15,500 వరకు ధర పలికింది. ఒకప్పుడు క్వింటాకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు మాత్రమే ధర లభించేది. తక్కువ ధరలు, అధిక పెట్టుబడులు, ఆశించిన దిగుబడులు రాకపోవడంతో రైతులు క్రమంగా పసుపు సాగు తగ్గించి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపారు.
ఆ సీజన్ నుంచే..
అయితే 2023-24 సీజన్ నుంచి ధరలు మెరుగుపడటం ప్రారంభమై క్వింటాకు రూ.10 వేల మార్కును దాటాయి. ఈ ఏడాది మార్చిలో సీజన్ ప్రారంభ సమయంలో రూ.12 వేల వరకు ధర లభించగా, మధ్యలో కొంత తగ్గాయి. గత నెల రోజులుగా మళ్లీ పెరుగుతూ రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
కేసముద్రంలో తగ్గిన విస్తీర్ణం..
నిజామాబాద్ తర్వాత వరంగల్ జిల్లాలోని ఎక్కువ విస్తీర్ణంలో పసుపు సాగు చేస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకప్పుడు కేసముద్రం మండలంలోనే ఆరు వేల ఎకరాలకు పైగా పసుపు సాగు జరిగేది. అయితే, గిట్టుబాటు ధరలు లేకపోవడం, పెట్టుబడి వ్యయం పెరగడం, దిగుబడి సమస్యల కారణంగా సాగు విస్తీర్ణం ఏటా తగ్గుతూ వచ్చింది.
ప్రస్తుతం ఈ మండలంలో వానాకాలంలో కేవలం 66 ఎకరాల్లో మాత్రమే పసుపు సాగు జరుగుతుండగా, మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 600 ఎకరాలకు లోపే సాగు జరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
విత్తనం కొరతతో ఆందోళన..
మార్కెట్లో ప్రస్తుతం ధరలు ఆశాజనకంగా ఉన్నా.. నాణ్యమైన పసుపు విత్తనం అందుబాటులో లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. ధరలు పెరిగినా సాగు విస్తీర్ణం వెంటనే పెరిగే పరిస్థితి కనిపించడం లేదు. గతంలో పసుపు సాగు చేసే రైతన్న సాంప్రదాయ పద్ధతిలో పంట పండించేవాడు. పసుపు పండించేందుకు పది నెలల కాలం పడుతుండడంతో వేరేది సాగు చేసే అవకాశం లేదు. పసుపు పండించిన రైతు పంట చేతికి వచ్చిన తర్వాత దాన్ని భద్రపరిచి గిట్టుబాటు ధర వచ్చిన క్రమంలో మార్కెట్‌కి తీసుకువెళ్లి అమ్మే పరిస్థితి ఉండేది.
కానీ మార్కెట్లో ధరలు తగ్గడంతో పసుపు సాగు చేసేవారి సంఖ్య తగ్గింది. దీంతో విత్తన కొరత ఏర్పడింది. అయితే ఈసారి నమోదైన రికార్డు ధరలు పసుపు రైతుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి. ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే వచ్చే సీజన్‌లో పసుపు సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

