అదనపు కట్న దాహానికి నిండు ప్రాణం బలి

కలం, ఖమ్మం బ్యూరో: ​భర్తకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్న సంతోషం ఆ ఇంట్లో ఐదు నిమిషాలైనా నిలవలేదు. ఆ కొలువే ఆ పచ్చని సంసారంలో అదనపు కట్నం రాబందులను మేల్కొలిపింది. ఉన్నతమైన ఉద్యోగం వచ్చిందనే అహంకారంతో, అదనపు కట్నం తేవాలంటూ భర్త, ఆడపడుచులు పెట్టిన మానసిక, శారీరక నరకయాతన తాళలేక ఓ వివాహిత గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయవిదారక సంఘటన భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా టేకులపల్లి(Tekulapalli) మండలం శంభునిగూడెంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శంభునిగూడెం గ్రామానికి చెందిన వజ్జ సుమ (25)కు వెంకటేశ్వర్లుతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వివాహ సమయంలో తమ స్థోమతకు తగ్గట్టుగా కట్నకానుకలు ఇచ్చారు. కొంతకాలం వారి కాపురం సజావుగానే సాగింది. ఇటీవల వెంకటేశ్వర్లుకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో పరిస్థితులు మారాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగం వచ్చిందన్న కారణంతో అదనపు కట్నం తీసుకురావాలని భర్త, ఆడపడుచులు సుమపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిపారు.

అదనపు కట్నం తీసుకురావడానికి సుమ నిరాకరించడంతో ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన సుమ ఇంట్లో ఉన్న గడ్డిమందు తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందింది. తమ కుమార్తెను అదనపు కట్నం కోసం వేధించి, దాడి చేసి చంపేశారని మృతురాలి తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. ఆయన ఫిర్యాదు మేరకు టేకులపల్లి ఎస్‌ఐ తిరుపతి భర్త వెంకటేశ్వర్లు, ఆడపడుచులపై కేసు నమోదు చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>