కలం, కరీంనగర్ : కరీంనగర్ (Karimnagar) నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం (Indiramma Housing Scheme) అమలులో పూర్తి పారదర్శకత పాటించాలని, అర్హులైన పేదలకు మాత్రమే ఇళ్ళు అందేలా చర్యలు తీసుకోవాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Chitra Mishra) ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ, గృహ నిర్మాణ పథకం నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే కీలకమైన కార్యక్రమమని అన్నారు. ఇలాంటి పథకాలను అత్యంత బాధ్యతాయుతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇళ్ల కేటాయింపు ప్రక్రియలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిజమైన అర్హులైన లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేయాలని కలెక్టర్‌ను కోరారు.
అలాగే గతంలో ఆరెపల్లి గ్రామంలో చేపట్టిన రోడ్డు నిర్మాణం సందర్భంగా ఇళ్ళు కోల్పోయిన బాధితులకు అప్పటి కలెక్టర్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీ మేరకు వారికి ఇందిరమ్మ ఇళ్ళు కేటాయించి న్యాయం చేయాలని ఆయన కోరారు.
క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన నిర్వహించి నిజమైన పేదలను గుర్తించాలని ఎమ్మెల్యే (Gangula Kamalakar) సూచించారు. ఇళ్ల కేటాయింపులో ఎలాంటి వివక్ష ఉండకూడదని, రాజకీయ పార్టీలకు అతీతంగా కేవలం పేదరికాన్ని ప్రాతిపదికగా తీసుకుని లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని స్పష్టం చేశారు. ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను పారదర్శకంగా ప్రకటించడం ద్వారా ప్రజలలో విశ్వాసం పెరుగుతుందని గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్ కార్పొరేటర్‌లు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Also: హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఎల్ఐజీ ఇళ్లకు శ్రీకారం!
Follow Us On: Instagram

