కలం, నిర్మల్ : ప్రజావాణికి వచ్చే దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని నిర్మల్(Nirmal) జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్(Kishore Kumar) అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వచ్చిన వినతులు, ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ, ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి తక్షణమే స్పందించాలని సూచించారు.
మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను ప్రత్యేక దృష్టితో పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజల సమస్యలను శాఖల మధ్య సమన్వయంతో పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజావాణి ద్వారా వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా పరిగణించి, ప్రజలకు సత్వర న్యాయం అందేలా అధికారులు పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ రాథోడ్ రమేష్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

